- రెడ్‌సీర్ స్ట్రాటజీ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: ఇంకో నాలుగేళ్లలో ఇండియా జనాభాలో జెన్ జెడ్ (1997- –2012 మధ్య పుట్టినవారి) వాటా 27 శాతానికి చేరుకుంటుందని, వీరు చేసే ఖర్చు ఏడాదికి దాదాపు రూ.120 లక్షల కోట్లను తాకుతుందని కన్సల్టంట్ కంపెనీ రెడ్‌సీర్ స్ట్రాటజీ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. కన్జూమర్ మార్కెట్ రూపురేఖలను ఈ తరం మార్చగలదని అభిప్రాయపడింది.
ఈ రిపోర్ట్ ప్రకారం, వీరు లేబుళ్లను పట్టించుకోకుండా షాపింగ్ చేస్తున్నారు. అందానికి, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ (బీపీసీ) రంగంలో 2030 నాటికి ఏడాది 19 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లు జరుపుతారని అంచనా. జెన్ జెడ్ మహిళల్లో సగం మంది తమ ఆదాయంలో 20శాతం కంటే ఎక్కువ బీపీసీ ఉత్పత్తులపై ఖర్చు చేస్తున్నారు.
స్కిన్, హెయిర్, బాడీ కోసం వేర్వేరు రొటీన్‌లు వాడడానికి ఇష్టపడుతున్నారు. మరోవైపు బ్యూటీ ట్రెండ్స్ లింగభేదం లేకుండా మారుతున్నాయి. యువకులు కూడా స్కిన్‌కేర్, మేకప్ వైపు ఆకర్షితులవుతున్నారు. “మెన్స్ స్కిన్‌కేర్ రొటీన్’’ సెర్చ్‌లు గత ఐదేళ్లలో 850శాతం పెరగడం దీనికి నిదర్శనం. జెన్ జెడ్ పురుషులు బీపీసీ ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తున్నారు.
ఫ్యాషన్ రంగంలో సగం
ఫ్యాషన్ రంగంలో 2030 నాటికి సగం వినియోగం జెన్ జెడ్ నుంచే ఉంటుందని రెడ్‌సీర్ రిపోర్ట్ తెలిపింది. ‘‘రూ. వెయ్యి లోపు ఫాస్ట్ ఫ్యాషన్ వస్తువులకు వీరు మొగ్గు చూపుతారు. ఈ–-కామర్స్‌లో జెన్ జెడ్ ఎక్కువగా ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ, ఒక్కో కొనుగోలులో ఖర్చు మిల్లెనియల్స్ కంటే సగం మాత్రమే ఉంటోంది”అని తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం, ఫిట్‌నెస్, స్పోర్ట్స్‌కు కూడా జెన్ జెడ్ ప్రాధాన్యం ఇస్తోంది.
మూడో వంతు జెన్ జెడ్ కనీసం 20శాతం ఆదాయాన్ని ఇక్కడ ఖర్చు చేస్తోంది. వీరి వలన అథ్లీజర్ దుస్తుల అమ్మకాలు ఏడాది లెక్కన 2025లో రెట్టింపు అయ్యాయి. రూ.500–1,000 మధ్య ధరల స్పోర్ట్స్ ఫుట్‌వేర్ ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఆరోగ్యకరమైన ఆహారం వైపు జెన్ జెడ్ మొగ్గుచూపుతోంది. 40శాతం మంది ప్రత్యామ్నాయ ప్రోటీన్లను ఎంచుకుంటున్నారు. దీంతో 2024–25లో ప్రోటీన్ సప్లిమెంట్ లిస్టింగ్స్ 230శాతం పెరిగాయి.
