కరోనా 20 ఏండ్లయినా బతుకుతది

కరోనా 20 ఏండ్లయినా బతుకుతది
  • మైనస్ 20 డిగ్రీల దగ్గర..రెండు దశాబ్దాలైనా సజీవంగా ఉంటది
  • మైనస్ 4 డిగ్రీల దగ్గర కూడా కొన్ని నెలలుంటది
  •  పచ్చి మాంసం, చేపలు ముట్టుకోవద్దు
  •  చైనీస్ ఎక్స్ పర్ట్ వెల్లడి
  • మైనస్ 20 డిగ్రీల దగ్గర.. రెండు దశాబ్దాలైనా సజీవంగా ఉంటది

బీజింగ్: ప్రపంచానికి మహమ్మారిగా మారిపోయిన కరోనా వైరస్ విపరీతమైన చలి వాతావరణంలో కొన్ని నెలలు, సంవత్సరాల వరకు కూడా సజీవంగా ఉండే అవకాశం ఉందట. మైనస్ 20 డిగ్రీ సెల్సియస్ ల టెంపరేచర్  దగ్గర ఈ వైరస్ సుమారుగా 20 ఏండ్ల పాటు బతకగలదట. మైనస్ 4 డిగ్రీల వాతావరణంలోనూ కొన్ని నెలలపాటు ఇది నిక్షేపంగా ఉంటుందట. చైనా సర్కారు ఏర్పాటు చేసిన కొవిడ్-19 ఎక్స్ పర్ట్ టీమ్ సభ్యుడు, ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ ప్రొఫెసర్ లీ లాన్ జువాన్ ఈ విషయాలు వెల్లడించారు. పచ్చి మాంసం, చేపల ద్వారా కూడా కరోనా వ్యాపించే ప్రమాదముందని, అందుకే వీటిని చేతులతో నేరుగా ముట్టుకోవద్దని ఆయన హెచ్చరించారు. ఈమధ్య  చైనాలోని హ్యాంగ్ఝౌలో జరిగిన ఓ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ..  కరోనా వైరస్ ముఖ్యంగా గడ్డకట్టే చలికి అస్సలు బెదిరే రకం కాదన్నారు. సముద్రం నుంచి తెచ్చే ఫుడ్ ను ఎక్కువగా గడ్డకట్టించి, నిల్వ చేస్తుంటారని, అలా ఫ్రీజ్ చేసిన ఫుడ్ అనేక దేశాలకు సరఫరా కావడం వల్ల కూడా వైరస్ బాగా వ్యాపించినట్లు అభిప్రాయపడ్డారు. సాల్మన్ చేపలు, ఇతర ఫ్రీజ్ చేసిన సీఫుడ్ దిగుమతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన చైనీస్ అధికారులకు సూచించారు.

యూరప్ నుంచి తిరిగి బీజింగ్ కు కరోనా.. 

యూరప్ దేశాల్లోని కరోనా వైరస్ కంటే ఈ వైరస్ స్ట్రెయిన్ పాతదానిలాగా ఉందని మరో ప్రముఖ ఎక్స్ పర్ట్ ఝాంగ్ యాంగ్ తెలిపారు. ఫ్రోజెన్ ఫుడ్ లేదా హోల్ సేల్ మార్కెట్ల ద్వారా ఇది వ్యాపిస్తుండవచ్చని చెప్పారు. కరోనా వైరస్ వుహాన్ నుంచి యూరప్ కు అక్కడి నుంచి తిరిగి బీజింగ్‌కు వచ్చినట్లుగా అనిపిస్తోందని బెన్ కౌలింగ్ అనే మరో హెల్త్ ఎక్స్ పర్ట్ తెలిపారు. అయితే, మొట్టమొదటి కరోనా వైరస్ కేసును గుర్తించడం ఇప్పుడు సాధ్యం కాదని, ఇప్పటికే చాలా ఆలస్యం అయిందన్నారు.