అవినీతి పోలీసులపై బాస్‌ల నిఘా

అవినీతి పోలీసులపై బాస్‌ల నిఘా

మామూళ్ల వసూలు, డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న

వారిపై  సీపీల చర్యలు థర్డ్ పార్టీతో ఫీడ్ బ్యాక్

నెల రోజుల్లో 14 మందిపై వేటు

హైదరాబాద్,వెలుగుసిటీని సేఫెస్ట్ సిటీగా మార్చుతామంటున్న పోలీస్ డిపార్ట్ మెంట్ ను వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి వెంటాడుతోంది. అవినీతికి తావు లేకుండా ప్రజలకు పారదర్శకమైన పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అందిస్తామని ఓ వైపు పోలీస్ బాస్ లు చెబుతుంటే.. మరోవైపు కొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతూ మూముళ్లు వసూలు చేస్తున్నారు. టెక్నికల్ గా, ఫైనాన్షియల్ గా డిపార్ట్ మెంట్ లో ఎన్ని మార్పులు వచ్చినా కొందరు పోలీస్ సిబ్బంది అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. ఓవైపు డ్యూటీలోనిర్లక్ష్యం,అవినీతి, నేరస్థులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో డిపార్ట్ మెంట్ ప్రతిష్టకు అవినీతి మచ్చ తెస్తున్నారు.  ఈ నెల రోజుల కాలంలో సస్పెండ్ అయిన పోలీసుల తీరే ఇందుకు ఉదాహరణ.  అవినీతి రహిత పోలీసింగ్ లో భాగంగా పోలీస్ డిపార్ట్ మెంట్ ఆన్ లైన్ లోనే సిటిజన్లకు సేవలు అందిస్తోంది. పోలీస్ స్టేషన్స్ కు వచ్చే బాధితులు,ఫిర్యాదుదారులపట్ల ఫ్రెండ్లీగా ప్రవర్తించేలా ప్రతీ రిసెప్షన్స్ లో ఇద్దరు కానిస్టేబుల్స్ ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు సోషల్ మీడియా వేదికగా ఫేస్ బుక్,ట్విట్టర్,ఇ–-మెయిల్ ద్వారా జనాల నుంచి ప్రజా సమస్యలను సేకరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్,సైబరాబాద్,రాచకొండ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్ లో ఏర్పాటు చేసిన థర్డ్ పార్టీ కాల్ సెంటర్స్ సిటిజన్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాయి. ఆన్ లైన్ లో వచ్చే పోస్టింగ్ కు ఎకనాలెడ్జ్ మెంట్ తో పాటు సంబందిత పోలీస్ అధికారి వివరాలు తెలుపుతున్నారు.

డబ్బులు తీసుకుని వదిలేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది

అవినీతికి ఎక్కువగా ఆస్కారం ఉండే  ట్రాఫిక్ వింగ్ ను పూర్తిగా క్యాష్ లెస్ విధానంలోకి మార్చారు. చలానా చెల్లింపుల దగ్గరి నుంచి డ్రంకెన్ డ్రైవ్ కేసుల వరకు అన్నీ ఆన్ లైన్ లోనే అప్ లోడ్ చేస్తున్నారు. ఇలాంటి క్యాష్ లెస్ విధానంలో కూడా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు ఫైన్ వేయకుండా వాహనదారుల నుంచి డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం సస్పెండ్ అయిన సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వి.రామ్ చందర్, ఎస్సై రాంబాబు, హోంగార్డ్స్ కె.అంకారావు,గోపాల్ పై సీపీ అంజనీకుమార్ తీసుకున్న చర్యలే ఇందుకు నిదర్శనం. ట్రాఫిక్ ఎన్ ఫోర్స్ మెంట్ లో స్పాట్ చలానాలు విధించడం కాకుండా వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ వాహనదారునికి ఆన్ లైన్ క్యాష్ లెస్ చలానా విధించాలి. కానీ అందుకు విరుద్ధంగా స్పాట్ చలానా పేరుతో వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులపై సీపీ అంజనీకుమార్ కి ఫిర్యాదులు అందాయి. నిర్ధేశించిన సమయాల్లో కాకుండా నెక్లెస్ రోడ్ తో పాటు లక్డీకాపూల్ పరిసర ప్రాంతాల్లో ఇష్టానుసారంగా వెహికల్ చెకింగ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఎస్సై రాంబాబు,హోంగార్డ్స్ కె.అంకారావు,గోపాల్ ఎన్ ఫోర్స్ మెంట్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డట్లు సీపీ అంజనీకుమార్ గుర్తించారు. దీంతో ఎస్సై సహా ఇద్దరు హోంగార్డ్స్ ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఇన్ స్పెక్టర్ రామ్ చందర్ కు చార్జి మెమో ఇచ్చి కార్ హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేశారు.

మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం

సోమవారం రాత్రి ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోశాల వద్ద పికెటింగ్ డ్యూటీలో ఉన్న ఈశ్వరయ్య తాగి న్యూసెన్స్ చేశాడు. కానిస్టేబుల్ న్యూసెన్స్ ను మొబైల్ ఫోన్స్ లో రికార్డ్ చేసిన స్థానికులు ఫలక్ నుమా ఇన్ స్పెక్టర్ కె.శ్రీనివాస్ రావుకి పంపారు. దీంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఈశ్వరయ్య చేసిన పబ్లిక్ న్యూసెన్స్ పై సీపీ అంజనీకుమార్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఈశ్వరయ్యను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు న్యూసెన్స్ కు  ఈశ్వరయ్యని బాధ్యుడిని చేస్తూ ఫలక్ నుమా ఇన్ స్పెక్టర్ కె.శ్రీనివాస్ రావుకు సీపీ చార్జి మెమో ఇచ్చారు.

దిశకేసులో నిర్లక్ష్యం 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నటీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం,హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే ప్రధాన కారమనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యంపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్న సిబ్బందిపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ యాక్షన్ తీసుకున్నారు. దిశ పేరెంట్స్ ఇచ్చిన సమాచారంతో శంషాబాద్‌‌ ఎస్సై ఎం.రవికుమార్‌‌,ఎయిర్‌‌పోర్ట్ పీఎస్ హెడ్‌‌ కానిస్టేబుళ్లు పి.వేణుగోపాల్‌‌రెడ్డి, ఎ.సత్యనారాయణ గౌడ్‌‌లను సీపీ సస్పెండ్ చేశారు. మిస్సింగ్‌‌పై వచ్చిన కంప్లయింట్ తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయకుండా నిర్లక్ష్యం వహించారని ముగ్గురు పోలీసులపై వేటు వేశారు.

హుక్కా సెంటర్లలో 

హుక్కా సెంటర్లలో వసూళ్ళకు పాల్పడిన నలుగురు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్సైలను నవంబర్ 7న సీపీ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు.  జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా హుక్కా సెంటర్లు నడుపుతున్న వారి నుంచి మామూళ్ళు వసూలు చేస్తున్నారని వీరిపై సీపీ అంజనీకుమార్ కి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆరునెలల పాటు వారిపై నిఘాపెట్టారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో గతంలో పనిచేసిన ఎస్సైలు కురుమూర్తి, డి.శ్రీనుతో పాటు ఇ.శంకర్, రామకృష్ణ, ఏఎస్సైలు మహ్మద్ జాఫర్, శామ్యూల్‌‌ను  సస్పెండ్ చేస్తూ గత నెలలో కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. సస్పెన్షన్ లో ఉన్న ఎస్సై కురుమూర్తి షాహినాజ్ గంజ్, డి.శ్రీను మహంకాళి పీఎస్ లో విధులు నిర్వహించేవారు.