కరోనా ​పేషెంట్లలో డెంగీ భయం..పడిపోతున్న ప్లేట్ లెట్స్

కరోనా ​పేషెంట్లలో డెంగీ భయం..పడిపోతున్న ప్లేట్ లెట్స్
  • ఒక్కసారిగా పడిపోతున్న ప్లేట్ లెట్స్
  • హాస్పిటల్స్​లో  పెరుగుతున్న డెంగీ కేసులు
  • రోజుకు ఐదు నుంచి ఆరు వరకు నమోదు

" హైటెక్​ సిటీకి చెందిన ఓ వ్యక్తి పది రోజుల కిందట తీవ్ర జ్వరంతో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అప్పటికే అతను పోస్ట్​ కొవిడ్ పేషెంట్.​ డాక్టర్​ మళ్లీ టెస్ట్ చేయగా నెగెటివ్ వచ్చింది. దీంతో మెడిసిన్ ​ఇచ్చి పంపించాడు. రెండు రోజుల  తర్వాత ఒక్కసారిగా అతడికి సీరియస్​ కావడంతో కుటుంబసభ్యులు వెంటనే హాస్పిటల్​కు తీసుకెళ్లారు. ఇతర టెస్ట్​లు చేస్తే ప్లేట్ లెట్స్ పడిపోయినట్టు తేలింది. 3 రోజులు అబ్జర్వేషన్​లో ఉంచుకుని నయం అయ్యాక తిరిగి డిశ్చార్జ్​చేశారు.’’ 

హైదరాబాద్, వెలుగు : కొవిడ్​ పేషెంట్లను డెంగీ భయపెడుతోంది. తీవ్ర జర్వం వచ్చి ఒక్కసారిగా ప్లేట్ లెట్స్ పడిపోతున్నాయి. ఇలాంటి కేసులు గ్రేటర్​లో రెండు వారాలుగా ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా వచ్చిపోయిన వారు, కరోనా పాజిటివ్ పేషెంట్లు ఫీవర్​తో ఆస్పత్రులకు వెళ్తుండగా డాక్టర్లు ముందుగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి రిజల్ట్ ని బట్టి వేరే టెస్టులు చేస్తుండగా డెంగీ సోకినట్లు తేలుతోంది. వెంటనే అబ్జర్వేషన్​లో ఉంచుకుని ట్రీట్ మెంట్​అందిస్తున్నారు. సిటీలో ఇలాంటి కేసులు సర్కార్​దవాఖానల కంటే ప్రైవేటులోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. డైలీ ఓపీకి వచ్చే పేషెంట్లలో ఐదారుగురు వీళ్లే ఉంటున్నారు. కరోనా వచ్చిపోయిన వారితో పాటు, ప్రస్తుతం పాజిటివ్ పేషెంట్లకు కూడా డెంగీ సోకితే డేంజరేనని డాక్టర్లు పేర్కొంటున్నారు. 

ఒకేసారి రెండు ఇన్​ఫెక్షన్ల బారినపడితే

వానాకాలంలో డెంగీ, టైఫాయిడ్, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు సాధారణమే.   కొవిడ్ సెకండ్ వేవ్​లో చాలా మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో చాలామందికి డెంగీ అటాక్ అవుతుందని, వచ్చిన వారిలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒకేసారి కరోనా, డెంగీ రెండు ఇన్​ఫెక్షన్ల బారినపడితే వారిని కో -ఇన్​ఫెక్షన్ ​పేషెంట్​గా గుర్తించి ట్రీట్​మెంట్​ అందిస్తున్నామన్నారు.  వీరిలో  ప్లేట్ లెట్స్ ఒక్కసారిగా పదివేల కంటే తక్కువకు పడిపోయే అవకాశం కూడా ఉండొచ్చంటున్నారు. డెంగీ, కరోనాలో జ్వరం, తలనొప్పి, దగ్గు, జలుబు, విరేచనాలు సాధారణంగా ఉంటాయంటున్నారు. డెంగీ వస్తే 4 రోజుల తర్వాత తగ్గిపోతుందని, జ్వరం తగ్గాక పేషెంట్లు వెంటనే ఇంటికెళ్లకుండా మరో రెండ్రోజులు ఆస్పత్రిలో ఉండాలంటున్నారు. ఇన్​ఫెక్షన్​అప్పుడే మొదలవుతుందని, వెంటనే ట్రీట్​మెంట్​ అందించాల్సి ఉంటుందని చెప్తున్నారు. 

అవయవాలపై తీవ్ర ప్రభావం

కో -ఇన్​ఫెక్షన్​ పేషెంట్లలో అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. లంగ్స్, లివర్, కిడ్నీ, హార్ట్ ప్రాబ్లమ్స్​వస్తాయి. గర్భిణులు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారిలో  కో- ఇన్​ఫెక్షన్​అటాక్​ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లేట్ లెట్స్  పడిపోవడం, ముక్కు, మలద్వారం నుంచి రక్తం పడడం జరిగితే  ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి ట్రీట్​మెంట్​తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 

పోస్ట్​ కొవిడ్​ పేషెంట్లకు తీవ్రత ఎక్కువే..

హాస్పిటల్​లో ఈ నెల1 నుంచి ఇప్పటి వరకు మొత్తం19కి పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. పోస్ట్​ కొవిడ్ ​పేషెంట్లకు డెంగీ వస్తే  తీవ్రత ఎక్కువ ఉంటుంది. హెల్త్ కండీషన్ పై అలర్ట్​గా ఉండాలి. పేషెంట్లు ఎక్కువగా ఇంట్లోనే ఉండాలి. చుట్టుపక్కల మురుగు, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. 
- డాక్టర్ ​శంకర్, సూపరింటెండెంట్, ఫీవర్ హాస్పిటల్

ఓపీలో 70 శాతం ఇవే కేసులు 

రెండు వారాలుగా ప్రతిరోజు ఓపీలో 70 శాతం డెంగీ కేసులే ఉంటుండగా 50 కేసులు నమోదు అయ్యాయి. పోస్ట్​కొవిడ్​పేషెంట్లలో  ప్లేట్ లెట్స్ పడిపోవడం ఎక్కువగా ఉంటుంది. వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. డెంగీ వస్తే మొదటి నాలుగు రోజులు  తలనొప్పి, విరేచనాలు, ఫీవర్ ఉంటుంది. ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లి డాక్టర్​అబ్జర్వేషన్ లో ఉండాలి. పబ్లిక్ ప్లేసెస్​కు ఎక్కువగా వెళ్లొద్దు . ఇంట్లో శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.  
- డాక్టర్​ రాహుల్ అగర్వాల్, జనరల్ ఫిజిషియన్, కేర్ హాస్పిటల్స్