
దేశంలో గణనీయంగా పెరుగుతూ వచ్చిన యూపీఐ (UPI) లావాదేవీలు ఈ ఏడాది ఏప్రిల్ 2024లో స్వల్పంగా తగ్గాయి. మార్చి నెలతో పోలిస్తే యూపీఐ లావాదేవీలు సంఖ్యా పరంగా 1 శాతం, విలువ పరంగా 0.7 శాతం క్షీణించాయి. గతనెలలో రూ.1,344 కోట్ల లావాదేవీలు జరగ్గా.. ఆ సంఖ్య ఏప్రిల్‌లో రూ.1,330 కోట్లకు తగ్గింది. అయితే, వార్షిక ప్రాతిపదికన చూస్తే.. యూపీఐ లావాదేవీలు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా డిజిటల్ వినియోగం వృద్ధి సాధిస్తుండటం, యూపీఐ నిర్వహణలో ఉన్న సౌకర్యమే అందుకు ప్రధాన కారణం.
2023-24 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు మునుపటి ఆర్థిక సంవత్సరం 2022-23తో పోలిస్తే సంఖ్యా పరంగా 57 శాతం, విలువలో 44 శాతం పెరుగుదల నమోదు చేశాయి. ప్రత్యేకించి మార్చి 2024లో, లావాదేవీల వాటా 55 శాతం పెరిగి రూ.1,344 కోట్లకు చేరుకుంది. అయితే, యూపీఐ లావాదేవీలు 100 బిలియన్లను అధిగమించడం ఇదే మొదటిసారి.
ఐఎంపీఎస్(IMPS) లావాదేవీలు మార్చితో పోలిస్తే.. ఏప్రిల్‌లో విలువ, సంఖ్యా పరంగా రెండింటిలో క్షీణతను చవిచూశాయి. లావాదేవీల విలువ.. మార్చిలో రూ.6.35 లక్షల కోట్ల నుంచి రూ.5.92 లక్షల కోట్లకు, ఫిబ్రవరిలో రూ.5.68 లక్షల కోట్లకు 7 శాతం తగ్గగా, సంఖ్యా పరంగా లావాదేవీలు ఫిబ్రవరిలో 535 మిలియన్లతో పోలిస్తే మార్చిలో 581 మిలియన్ల నుండి ఏప్రిల్‌లో 550 మిలియన్లకు 5 శాతం తగ్గాయి. ఇక ఏప్రిల్‌లో ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలు సంఖ్యా పరంగా 3 శాతం, విలువలో 6 శాతం తగ్గాయి. ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలు మార్చిలో రూ.5,939 కోట్ల నుంచి ఏప్రిల్‌లో రూ.5,592 కోట్లకు తగ్గాయి.