40 ఏళ్ల రికార్డులు బద్దలు: క్రూడాయిల్ ధరను దాటేసిన 'వెండి'.. రెండేళ్లలో

40 ఏళ్ల రికార్డులు బద్దలు: క్రూడాయిల్ ధరను దాటేసిన 'వెండి'.. రెండేళ్లలో

దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధరలు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. బుధవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(MCX)లో వెండి ధరలు మునుపెన్నడూ లేని విధంగా లైఫ్‌టైమ్ హైని తాకాయి. సుమారు 40 ఏళ్ల తర్వాత వెండి ధర క్రూడాయిల్ రేట్లను అధిగమించటం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తోంది. కేవలం పెట్టుబడి సాధనంగానే కాకుండా.. పారిశ్రామిక అవసరాల వల్ల వెండికి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ కొనసాగుతోంది.

బుధవారం ట్రేడింగ్‌లో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో స్పాట్ మార్కెట్లో మార్చి డెలివరీ వెండి కాంట్రాక్టులు ఏకంగా 4 శాతం పెరిగి కిలోకు రూ.2,05,410 వద్ద ట్రేడ్ అయింది. ఇంట్రాడేలో ఇది రూ. 2,06,111 అనే రికార్డు స్థాయిని కూడా తాకింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో వెండి రేటు 5 శాతం పెరిగి ఔన్సుకి 66.41 డాలర్లకు చేరుకోగా. ఇంట్రాడేలో అత్యధికంగా 66.65 డాలర్ల చారిత్రాత్మక గరిష్టాన్ని హిట్ చేసింది.

వెండి రేట్ల ధగధగ వెనుక కారణాలు..
1. అమెరికా నిరుద్యోగ గణాంకాలు: అమెరికాలో నిరుద్యోగ రేటు 4.6 శాతానికి పెరగడంతో అక్కడి ఫెడరల్ రిజర్వ్ 2026లో వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు పెరిగాయి. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే సూచనలు ఉంటే వెండి, బంగారం వంటి ఆస్తులపై పెట్టుబడులు పెరుగుతాయి.
2. పారిశ్రామిక డిమాండ్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వెండి కీలక పాత్ర పోషిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ఎనర్జీ, మొబైల్ ఫోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాల తయారీలో వెండిని వినియోగం పెరిగింది.
3. క్రూడాయిల్‌ను మించి: 1980ల తర్వాత మొదటిసారి వెండి ధర క్రూడ్ ఆయిల్ రేట్లను అధిగమించడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

వెండి రేటు పెరుగుదల ఒక కొత్త యుగానికి ప్రారంభంగా ఛాయిస్ బ్రోకింగ్‌కు చెందిన కమోడిటీ అనలిస్ట్ అమీర్ మక్దా అభిప్రాయ పడ్డారు. భవిష్యత్తులో అరుదైన, పారిశ్రామికంగా కీలకమైన మెటల్స్ కే ప్రాధాన్యత ఉంటుందని మార్కెట్ ట్రెండ్ సూచిస్తోందని ఆయన అన్నారు.

1979 తర్వాత వెండిలో ఇంతటి భారీ ర్యాలీని ఇప్పుడే చూస్తున్నామని ఎస్‌ఎమ్‌సి గ్లోబల్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ వందనా భారతి వెల్లడించారు. అప్పట్లో వెండి ధర 6 డాలర్ల నుండి 30 డాలర్లకు పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం వెండి ధరల్లో 15-20 శాతం స్వల్పకాలిక కరెక్షన్  జరిగే అవకాశం ఉన్నప్పటికీ.. రాబోయే రెండేళ్లలో వెండి ధర ఔన్సుకు 85 డాలర్ల నుంచి 90 డాలర్ల మార్కును తాకవచ్చని ఆమె అంచనా వేశారు. దీంతో వెండి ప్రస్తుతం కేవలం నగలు, అలంకరణ వస్తువులకే పరిమితం కాకుండా.. గ్రీన్ ఎనర్జీ, హైటెక్ పరిశ్రమలకు 'వెన్నెముక'గా మారుతోంది. అందుకే రేట్లు ఊహలకు అందకుండా పెరిగిపోతున్నాయ్ అని నిపుణులు చెబుతున్నారు.