హైదరాబాద్: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను కొట్టివేసి.. ఐదుగురు ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ మండిపడింది. స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళతామని BRS ఎమ్మెల్యేలు చెప్పారు. తీర్పు కాపీ ఇవ్వమని అడిగినా స్పీకర్ నుంచి సమాధానం లేదని బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. Legislative లా ప్రకారం కాపీ ఇవ్వాలనే నిబంధన ఉందని.. అయినా ఈ తీర్పుకు సంబంధించిన కాపీ తమకు ఇవ్వలేదని అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు.
కేవలం ఒక పారాగ్రాఫ్ మాత్రమే తమకు ఇచ్చారని.. తెలంగాణ శాసనసభ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని స్పీకర్ తమకు ఇచ్చిన కాపీలో ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరించారు. Order కాపీ చదివి వినిపించే నిబంధనలు ఉంటాయని, వాటిని పట్టించుకోలేదని బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళతామని, న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ చెప్పుకొచ్చింది.
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురు MLAలను విచారించిన అనంతరం.. అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఐదుగురు MLAలపై ఆరోపణలను స్పీకర్ తోసిపుచ్చారు. పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవని స్పీకర్ చెప్పారు.
స్పీకర్ నిర్ణయంతో.. ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్, ప్రకాష్‌గౌడ్, గూడెం మహిపాల్‌కు ఊరట లభించింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయించారనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. వారిపై అనర్హత వేటు వేయాలన్నది బీఆర్ఎస్ డిమాండ్.
