వామ్మో రెండు రోజుల్లోనే రూ.5 లక్షల కోట్లు మటాష్.. వెండి, బంగారాన్ని నమ్ముకున్న వాళ్ల పరిస్థితేంటి..?

వామ్మో రెండు రోజుల్లోనే రూ.5 లక్షల కోట్లు మటాష్.. వెండి, బంగారాన్ని నమ్ముకున్న వాళ్ల పరిస్థితేంటి..?

ఒక పర్వత శిఖరాన్ని చాలా కష్టపడి ఎక్కి.. మళ్లీ దిగకుండా నేరుగా కిందికి దూకేస్తే ఎలా ఉంటుంది.. ఇప్పుడు వెండి,  బంగారం ధరల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇన్వెస్టర్ల సంపదను డబల్, త్రిబుల్ చేస్తూ కళ్లెంలేని గుర్రాల్లాగా ఇన్నాళ్లు పరుగులు తీసిన వెండి, బంగారం.. పీక్స్ చేరుకున్నాక అంతకు మించిన వేగంతో ఢమాల్ అనటం షాకింగ్ కు గురిచేస్తోంది. కేవలం రెండే రెండు రోజులలో గోల్డ్, సిల్వర్ కలిసి 5 ట్రిలియన్ డాలర్స్ (5 లక్షల కోట్ల రూపాయల) మార్కెట్ క్యాప్ డౌన్ కావడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. 

శుక్రవారం ( జనవరి 30) ఒక్క రోజులోనే 10 గ్రాముల గోల్డ్ రూ.14 వేలు పడిపోగా, సిల్వర్ కేజీకి 20 వేల రూపాయలకు పైగా పడిపోయి షాకిచ్చింది.  బంగారం, వెండి గురువారం పీక్స్ కు చేరుకున్నాక.. అంటే తులం బంగారం లక్షా 83 వేలకు, కేజీ వెండి రూ.4 లక్షల 4 వేల500 లకు చేరుకున్న తర్వాత ఇంత షార్ప్ గా పడిపోవడం గందరగోళ పరిస్థితులలో పడేసిందనే చెప్పవచ్చు. రికార్డు హైస్ నుంచి గోల్డ్ 10 శాతం పడిపోగా.. సిల్వర్ 20 శాతం పడిపోయింది. 

ఎందుకు ఇంతలా పెరిగింది.. ఎందుకు పడుతోంది..?

ప్రపంచ వ్యాప్తంగా పొలిటికల్ టెన్షన్స్, అమెరికా టారిఫ్స్ అంటూ బెదిరింపులు, వడ్డీ రేట్ల పరిస్థితిపై  నెలకొన్న అనిశ్చితితో పాటు  ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వస్తుందన్న భయాలు బంగారం ధరల పెరుగుదలకు దారితీశాయి. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తూ నిల్వ చేసుకోవడం కూడా ఈ పెరుగుదలకు కారణం. 

ఇంకో కారణం ఏంటంటే ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను ఆందోళనలో పడేశాయి. ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడోనన్న అనుమానంతో డాలర్ పెట్టుబడులను తగ్గించి.. గోల్డ్, సిల్వర్ లో ఇన్వెస్ట్ మెంట్లను ప్రపంచ దేశాలు పెంచుకుంటుండటంతో ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇన్వెస్టర్లు కూడా గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్ భారీ మొత్తంలో చేస్తుండటంతో.. పెట్టుబడులన్నీ ఈ మెటల్స్ లోకి వచ్చిచేరుతున్నాయి. దీంతో రాకెట్ స్పీడుతో బంగారం, వెండి సామాన్యులకు అందకుండా పెరిగిపోయాయి.  

వెండి ధర పెరుగుదలకు కారణం.. మార్కెట్ సెంటిమెంట్ కంటే.. ఈ మెటల్ కు పెరుగుతున్న డిమాండే కారణం. సోలార్ ప్లేట్స్.. ఎలక్ట్రిక్ వెహికిల్స్, సెమీకండక్టర్లు వంటి క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలకు  సిల్వర్ చాలా కీలకం. ప్రతి సోలార్ ప్లేట్ లో దాదాపు 20 గ్రాముల వెండి ఉంటుంది.  ప్రపంచ డిమాండ్‌లో సౌర పరిశ్రమ దాదాపు 30 శాతం వాటా కలిగి ఉంది. EV లకు ప్రతి వాహనానికి 25–50 గ్రాముల వెండి అవసరం అవుతుంది. వీటికి తోడు AI డేటా సెంటర్లు సెమీకండక్టర్ వాడకం కారణంగా బంగారాన్ని మించిన డిమాండ్‌ ఇప్పుడు వెండికి ఉండటంతో ఈ మెటల్ ఇటీవల ఇంత భారీగా పెరిగింది. మరొక విషయం ఏమిటంటే.. వెండిని ఇతర మెటల్స్ మాదిరిగా ఉత్పత్తి చేయడం కుదరదు. వెండి తయారీకి ఇతర లోహాల బై ప్రొడక్ట్ గా తయారు చేయటం అనేది క్లిష్టమైన పని. అందుకే వెండి ఇప్పుడు ఇన్వెస్టర్లను ఆకర్షస్తోంది. 

 ఫాల్ కు కారణం:

అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్‌గా  కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్న తర్వాత.. గోల్డ్, సిల్వర్ ర్యాలీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుందనే చెప్పాలి. శుక్రవారం బంగారం, వెండి రెండింటిలోనూ షార్ప్ కరెక్షన్‌కు దారితీసింది. ఫ్యూచర్ లో ఫెడ్ తీసుకునే నిర్ణయం (హాకిష్ పాలసీ) ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను మరింత అస్థిరత్వానికి గురిచేస్తుందనే ఊహాగానాల నడుమ మార్కెట్లలో కరెక్షన్ మొదలైనట్లు విశ్లేషఖులు చెబుతున్నారు. దీనికి తోడు US డాలర్ పుంజుకోవడం, బాండ్ ఈల్డ్స్ పెరగటం.. తర్వాత భారీ ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పూర్తిగా మారిపోయింది. దీంతో అమ్మకాల ఒత్తడి మరింత పెరిగి భారీ ఫాల్ కు దారి తీసింది. 

భవిష్యత్తేంటి..?

బుల్లిష్ ఫ్యాక్టర్స్:

సిటీ బ్యాంక్ వంటి సంస్థల అభిప్రాయం ప్రకారం.. జియో పొలిటికల్ టెన్షన్స్.. అంటే టారిఫ్స్, వివిధ దేశాల మధ్య యుద్ధ వాతావరణం మొదలైన అంశాలు బంగారానికి మరింత డిమాండ్ ను పెంచవచ్చు. సిల్వర్ విషయానికి వస్తే.. ఫ్యూచర్ లో సోలార్, ఈవీ మొదలైన ఉత్పత్తులకు మరింత డిమాండ్ ఉండటంతో సిల్వర్ లాంగ్ రన్ లో పెరగటానికి ఛాన్స్ ఉండవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి పెరిగుతున్నంత కాలం ఈ రెండు మెటల్స్ కు డిమాండ్ పెరుగుతూనే ఉంటుందనేది ఆర్థిక సర్వేతో పాటు వివిధ సంస్థల అభిప్రాయం.

బేరిష్ ఫ్యాక్టర్స్ (రిస్క్):

పాజిటివ్ అంశాలెన్నున్నా.. గత కొద్ది రోజులుగా చూస్తున్న ట్రెండ్ ఆధారంగా వొలాటిలిటీ కొనసాగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు. మరొక విషయం ఏమిటంటే.. మార్కెట్ చరిత్రను పరిశీలిస్తే.. షార్ప్ ర్యాలీ వచ్చిన తర్వాత ఒకానొక దశలో.. ఫాల్ ఉండటం సహజం. ప్రాఫిట్ బుకింగ్, ఇంట్రెస్ట్ రేట్లలో మార్పు, భౌగోళిక పరిస్థితులు అనుకూలించడం తర్వాత.. ధరల తగ్గుదలకు దారితీయటం సహజం.

భౌగోళిక టెన్షన్స్, ఇన్ ఫ్లేషన్, కరెన్సీ పతనం  మొదలైన అనిశ్చితి ఉన్నంత కాలం గోల్డ్, సిల్వర్ లాంగ్ టర్మ్ హెడ్జింగ్ కింద ఇన్వెస్టర్లు, ప్రపంచ బ్యాకులు పెడుతుంటాయి. కాబట్టి లాంగ్ టర్మ్ లో ఈ మెటల్స్ లాభాలు ఇచ్చే అవకాశం ఉంటుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. 

షార్ట్ టర్మ్ లో మాత్రం సంపద బుగ్గిపాలు అయినా చెప్పలేం అంటున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ ప్రభావంతో ఎప్పుడు పెరుగుతాయో, ఎక్కడ పడతాయో చెప్పడం కష్టం.

అయితే ప్రస్తుతం వెండి, బంగారం ధరలు పీక్స్ కు చేరుకున్న సందర్భంగా.. ఈ హైస్ లో కొన్నవారికి భారీ లాభాలు ఆశించడం కష్టమైన పనే అంటున్నారు. అందుకే బాగా పెరుగుతున్నాయి కదా.. ఒకటి రెండు రోజుల్లో పడిందంటే మళ్లీ పెరుగుతందనే ఆలోచనలో ఉండి.. కొంటే మాత్రం భారీగా నష్టపోయే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ పెరిగినా.. ఒక సంవత్సరం క్రితం కొన్నవారికి వచ్చినంత లాభం రాకపోవచ్చు. అసలు మార్కెట్ హై లో ఉన్నప్పుడు కొనటమే హై రిస్క్. అంత తెలివైన పని కాదనేది పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల అభిప్రాయం. సో.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలి అనేది.. సోషల్ మీడియా ప్రెడిక్షన్స్ చూసి డిసైడ్ కాకుండా.. మీ ఫైనాన్షినల్ అడ్వైజర్లను అడిగి నిర్ణయం తీసుకోవడం మంచిది.