ప్రస్తుతం ప్రపంచం మొత్తం క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ కొరత గురించి ఆందోళన చెందుతోంది. కానీ వీటన్నింటికంటే ప్రమాదకరమైన, ఎవరూ పెద్దగా చర్చించని ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తోంది. రాబోయే రెండు నెలల పాటు గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం ఇలాగే కొనసాగితే.. మనం వాడే స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, చివరకు ఎలక్ట్రిక్ కార్ల రేట్లు కూడా సామాన్యుడికి అందనంతగా పెరిగిపోతాయి. దీనికి ప్రధాన కారణం క్రూడ్ ఆయిల్ కొరత మాత్రమే కాదు.. తెరవెనుక ఉన్న 'సల్ఫ్యూరిక్ యాసిడ్' అలాగే 'చిప్స్' సంక్షోభం.
క్రూడ్ ఆయిల్, గ్యాస్‌ను శుద్ధి చేసే క్రమంలో ఉప ఉత్పత్తిగా సల్ఫర్ వస్తుంది. దీని నుండే సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను తయారు చేస్తారు. అయితే ఇప్పుడు హార్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా సల్ఫ్యూరిక్ యాసిడ్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎలక్ట్రానిక్స్ తయారీలో వాడే కాపర్, నికెల్, కోబాల్ట్ వంటి ఖనిజాలను ప్రాసెస్ చేయడానికి ఈ యాసిడ్ తప్పనిసరి. అంటే యాసిడ్ కొరత ఏర్పడితే బ్యాటరీలు, మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌ల తయారీ ఆగిపోవడం, ఖరీదైనవిగా మారిపోవటం జరుగుతుంది. ఇది కేవలం పారిశ్రామిక సమస్య మాత్రమే కాదు.. నేరుగా వినియోగదారుడి జేబుకు చిల్లు పెట్టే అంశం అంటున్నారు నిపుణులు.
మరోవైపు ప్రపంచానికి చిప్స్‌ను సరఫరా చేసే తైవాన్ కూడా యుద్ధంతో తీవ్రంగా ప్రభావితం అవనుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో సుమారు 40 శాతం నేచురల్ గ్యాస్ పైనే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా తైవాన్ వద్ద 10 నుంచి 11 రోజులకు మించి గ్యాస్ నిల్వలు ఉండవు. ఇప్పుడు సరఫరా నిలిచిపోవడంతో.. వారు వెంటనే బొగ్గు వంటి ఇతర ఇంధన వనరులకు మారాల్సి వస్తోంది. ఈ హఠాత్తు మార్పు వల్ల విద్యుత్ ఖర్చు పెరిగి, చిప్స్ ఉత్పత్తి భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. చిప్స్ కొరత ఏర్పడితే కార్ల నుంచి వాషింగ్ మెషీన్ల వరకు ప్రతి వస్తువు తయారీపై దాని ప్రభావం పడుతుంది.
ప్రస్తుతానికి తయారీదారులు ధరలను పెంచకపోయినా, మార్కెట్‌లో స్టాక్ తక్కువగా ఉండటంతో రిటైలర్లు డిస్కౌంట్లను ఎత్తివేసి.. అధిక ధరలకు అమ్మే అవకాశం ఉంది. యుద్ధం మరో రెండు మూడు నెలలు కొనసాగితే, కంపెనీలు తప్పనిసరి పరిస్థితుల్లో ధరలను భారీగా పెంచక తప్పదు. చమురు ధరల కంటే ఈ చైన్ రియాక్షన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత కుదిపేయనుంది. మనం వాడే గ్యాడ్జెట్ల భవిష్యత్తు ఇప్పుడు యుద్ధ మేఘాల మధ్య చిక్కుకుపోయింది. ఈ పరిస్థితులు ఎలక్ట్రానిక్స్, ఆటో, హోమ్ అప్లయన్సెస్ వంటి రంగాలపై పరోక్షంగా భారాన్ని పెంచుతుందని దీంతో కార్ల రేట్ల నుంచి గృహోపకరణాల వరకూ అన్నింటి ధరలూ పెరుగుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం.
