కుప్పకూలిన రూపాయి: చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్టాలకు పతనం

కుప్పకూలిన రూపాయి: చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్టాలకు పతనం

భారత కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఇప్పుడు దేశ ఆర్థిక వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మార్చి 18న డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 92.63 వద్ద ముగిసింది. మునుపటి సెషన్‌తో పోలిస్తే ఇది భారీ పతనం కాగా.. ఇంట్రాడేలో ఒక దశలో 92.64 స్థాయిని తాకి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ప్రధానంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డాలర్ల కోసం ఎగబడటం, ముడి చమురు ధరలు మరింత పెరుగుతాయనే భయంతో ముందస్తుగా హెడ్జింగ్ చేయడమే రూపాయిని ఈ స్థాయికి దిగజార్చింది.

ప్రస్తుతం పశ్చిమ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో ఏర్పడిన ఆటంకాలు రూపాయిని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు ప్రారంభమైనప్పటి నుండి అంతర్జాతీయ మార్కెట్‌లో బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 40.2 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 100 డాలర్ల పైన స్థిరంగా కొనసాగుతుండటం భారత ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారింది. మన దేశ అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉండటంతో క్రూడ్ దిగుమతుల బిల్లు పెరిగి కరెంటు ఖాతా లోటుపై ఒత్తిడి పడుతోంది.

గత 10 ట్రేడింగ్ సెషన్లలో రూపాయి రికార్డు స్థాయి పతనాన్ని చూడటం ఇది ఐదోసారి. మార్చి 19న మార్కెట్ సెలవు ఉండటంతో, చివరి గంటలో దిగుమతిదారులు పెద్ద ఎత్తున డాలర్ల కొనుగోళ్లకు దిగడం రూపాయిని మరింత బలహీనపరిచింది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ మార్కెట్‌లో చురుగ్గా జోక్యం చేసుకుంటున్నప్పటికీ, అంతర్జాతీయ పరిణామాలు రూపాయిపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రస్తుత ధోరణిని బట్టి చూస్తే, రూపాయి త్వరలోనే 93 స్థాయిని తాకవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ.. క్రూడ్ సెగలు తగ్గనిదే రూపాయికి ఊరట లభించేలా లేదు. రాబోయే సెషన్లలో 92.75, 92.90 స్థాయిలు కీలక నిరోధకాలుగా ఉండనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ బ్రెంట్ క్రూడ్ ధరలు తగ్గకపోతే, ఆర్‌బీఐ తన పట్టును సడలించవచ్చని, ఫలితంగా రూపాయి మరింత దిగువకు వెళ్లే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.