శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ మూడో రోజు విరాచార విన్యాసాలు, అత్యంత భక్తిశ్రద్ధలతో కూడిన, ఒళ్లు గగుర్పొడిచే ఘట్టం అగ్నిగుండ ప్రవేశం జరుగుతోంది . ముఖ్యంగా కర్ణాటక నుంచి వచ్చే వీరశైవ భక్తులు (మలధారులు) ఈ క్రతువును భక్తి పారవశ్యంతో నిర్వహిస్తారు. కన్నడ భక్తులు తమ ఆరాధ్య దైవమైన మల్లికార్జున స్వామిపై ఉన్న భక్తిని చాటుకోవడానికి నిప్పు కణికలపై నడుస్తారు. ఈ భక్తులు ఉగాదికి కొన్ని రోజుల ముందు నుండే కఠినమైన దీక్ష (మలధారణ) చేపట్టి, పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటారు. అగ్నిగుండంపై నడవడం వల్ల తమ పాపాలు తొలగిపోతాయని, స్వామివారి అనుగ్రహం లభిస్తుందని వారి నమ్మకం.
వీరాచార విన్యాసం
వీరశైవ సంప్రదాయంలో శివుడిని 'వీరభద్రుడి' రూపంలో ఆరాధిస్తారు. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన వీరభద్రుని ఆవేశానికి ప్రతీకగా భక్తులు ఈ విన్యాసాలు చేస్తారు. ఇందులో భాగంగా భక్తులు తమ శరీరాన్ని కష్టపెట్టుకుంటూ భక్తిని ప్రదర్శిస్తారు.
మార్చి 16 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 20 వరకు జరగనున్నాయి. మొదటి రోజు ధ్వజారోహణం, భృంగి వాహన సేవ, రెండవ రోజు కైలాస వాహన సేవ, మూడో రోజు రావణ వాహన సేవ, నాలుగవ రోజు (ఉగాది)న రథోత్సవం, నంది వాహన సేవ, పంచాంగ శ్రవణం, ఐదవ రోజు ధ్వజావరోహణం, పూర్ణాహుతి, పుష్ప పల్లకి సేవ జరగనుంది.
ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఇప్పటికే కన్నడ, మహారాష్ట్ర భక్తులకు పాదయాత్ర మార్గంలో.. క్షేత్రంలో పలుచోట్ల చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు తాగు నీటికి ఎలాంగి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.
