కేంద్ర బడ్జెట్‎లో తెలంగాణకు ఏం లేదు.. మోడీని ఎన్నిసార్లు కలిసిన నో యూజ్: డిప్యూటీ సీఎం భట్టి

కేంద్ర బడ్జెట్‎లో తెలంగాణకు ఏం లేదు.. మోడీని ఎన్నిసార్లు కలిసిన నో యూజ్: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్: 2026-27 యూనియన్ బడ్జెట్‎లో తెలంగాణకు కేటాయింపులు ఉంటాయని ఆశించామని.. కానీ బడ్జెట్‎లో తెలంగాణకు ఏమి లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు నిధులు కేటాయించాలని అనేక సార్లు కేంద్రాన్ని, ప్రధాని మోడీని కలిసిన ప్రయోజనం లేదన్నారు. ఆదివారం (ఫిబ్రవరి 1) ప్రజా భవన్‎లో మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర బడ్జెట్‎పై భట్టి రియాక్ట్ అయ్యారు. 

బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడం దారుణమని అన్నారు. పలుమార్లు కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి నిధులు కేటాయించాలని అనేక వినతులు ఇచ్చామని అయినా బడ్జెట్‌లో కేటాయింపులు చేయకపోడం తీవ్రంగా నిరాశపర్చిందన్నారు. ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్ అయినా నగరాన్ని విస్మరించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ పార్క్ రాష్ట్రానికి కేటాయించాలని అనేక సార్లు కేంద్రాన్ని కోరామని గుర్తు చేశారు. సెమీ కండక్టర్ పార్క్ ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్న హైదరాబాద్‎ను పక్కన బెట్టారని అన్నారు. 

ఫార్మా రంగం అంటే హైదరాబాదేనని.. కొవిడ్ వ్యాక్సిన్ కూడా ఇక్కడే తయారైందన్నారు. బయోఫార్మా అంటే కేంద్రానికి తెలంగాణ గుర్తుకు రావాలి కదా అని అన్నారు. అలాగే క్రీడారంగంపై తెలంగాణ చాలా ఫోకస్‌ పెట్టిందని.. క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్‌ యూనివర్సిటీని పెట్టామని గుర్తు చేశారు. స్పోర్ట్స్‌ విభాగంలోనూ తెలంగాణకు బడ్జెట్‌  కేటాయింపులు లేవన్నారు.

►ALSO READ | కేసీఆర్ ఏం దేశం కోసం పోరాటం చేయలే: బీఆర్ఎస్ నిరసనలపై మంత్రి అడ్లూరి ఫైర్

 రేర్ ఎర్త్ మినరల్స్ మన రాష్ట్రంలోనే ఉన్నాయని.. సింగరేణి, రామగుండంలో ఈ ఖనిజాలు ఉన్నాయన్నారు. కానీ రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలోనూ తెలంగాణపై కేంద్రం దృష్టి పెట్టలేదన్నారు. టూరిజం డెవలప్మెంట్ కోసం హైదరాబాద్‎ను పరిగణలోకి తీసుకోలేదని.. ఆరెంజ్ ఎకానమీలో నగరంపై దృష్టి పెట్టలేదని అన్నారు. బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గురించి కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. 

2047 గోల్ పెట్టుకుని తెలంగాణ ముందుకు వెళ్తుంటే.. దానికి ప్రోత్సాహం అందించాల్సిన కేంద్రం నెగ్లెక్ట్ చేస్తుందని.. యూనియన్ బడ్జెట్‎లో తెలంగాణకు కేంద్రం చేసిన అన్యాయంపై పార్టీలకతీతంగా స్పందించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలు, మంత్రులను కలుస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.