హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ఆదివారం (ఫిబ్రవరి 1) జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపాల్ ఎన్నికల్లో లబ్ది కోసమే కేసీఆర్ విచారణపై బీఆర్ఎస్ పార్టీ రాద్దాంతం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఏమీ దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తి కాదని.. అనైతికంగా ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసులో విచారణకు పిలిస్తే నిరసనలు తెలపడం ఏంటని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూళ్లు చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
ఆధారాలు లేకుండా సిట్ ఎవరిని విచారణకు పిలవదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సాక్ష్యత్తూ కేసీఆర్ కూతురు కవిత చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఎవరూ తప్పు చేసిన చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు.
►ALSO READ | కేసీఆర్ రాజు కాదు.. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఆదివారం (ఫిబ్రవరి 1) కేసీఆర్ను విచారిస్తోన్న విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో ఆదివారం (ఫిబ్రవరి 1) నిరసనలు చేపట్టారు.
