ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా అల్కరాజ్.. 88 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన స్పెయిన్ యువ సంచలనం

ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా అల్కరాజ్.. 88 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన స్పెయిన్ యువ సంచలనం

మెల్ బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విజేతగా స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. ఆదివారం (ఫిబ్రవరి 1) హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో నోవాక్ జొకోవిచ్‌ను ఓడించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ కిరీటాన్ని ముద్దాడాడు. తద్వారా అల్కరాజ్ 88 సంవత్సరాల రికార్డ్ బ్రేక్ చేశాడు. డాన్ బడ్జ్ రికార్డును బద్దలు కొట్టి కెరీర్ గ్రాండ్ స్లామ్‌ను పూర్తి చేసిన అతి పిన్న (22 సంవత్సరాల 272 రోజులు) వయస్కుడిగా నిలిచాడు. కెరీర్‎లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ఎంతో కాలంగా వేచిచూస్తోన్న జొకోవిచ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.

మ్యాచ్ విషయానికి వస్తే.. అల్కరాజ్, జొకోవిచ్ మధ్య టైటిల్ ఫైట్ ఉత్కంఠభరితంగా సాగింది. జొకోవిచ్ అత్యుత్తమ ప్రదర్శనతో మొదటి సెట్‌ను 6-2 తేడాతో గెలుచుకున్నాడు. తొలి సెట్ కోల్పోయిన అల్కరాజ్ తిరిగి వెంటనే పుంజుకున్నాడు. రెండవ సెట్‌లో 6-2 తేడాతో గెలిచి పోరును సమం చేశాడు. చెరో సెట్ గెలిచిన జకో, అల్కరాజ్ మూడో సెట్‎లో హోరాహోరీగా తలపడ్డారు.

 చివరికి, అల్కరాజ్ మూడవ సెట్‌ను కూడా చేజిక్కించుకున్నాడు. నాల్గవ సెట్‏లో 5-5తో నిలువగా సర్వీస్ నిలబెట్టుకోవడంలో జొకోవిచ్ విఫలమయ్యాడు. దీంతో అల్కరాజ్ కెరీర్‌లో తొలిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుచుకున్నాడు. అంతేకాకుండా అతి చిన్న వయస్సులో ఆస్ట్రేలియన్ ఓపెన్, కెరీర్ గ్రాండ్ స్లామ్‌ను పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.