సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే కేవలం గ్లామర్, టాలెంట్ ఉంటే సరిపోదు.. ఎన్నో ఒడిదుడుకులను, ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాలని చెబుతోంది నటి ఐశ్వర్య రాజేష్. తమిళంతో పాటు తెలుగులోనూ ‘వడ చెన్నై’, ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడూ బోల్డ్ అండ్ సెన్సిబుల్ పాత్రలు చేసే ఈమె.. లేటెస్ట్ గా తన వ్యక్తిగత జీవితంలోని చేదు జ్ఞాపకాలను బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోగ్రాఫర్ ప్రవర్తనతో షాక్ అయ్యాను!
ఇటీవల ఒక పోడ్‌కాస్ట్‌లో తన కెరీర్ ఆరంభంలో ఎదురైన కొన్ని భయంకరమైన అనుభవాలను పంచుకొని అందరినీ షాక్‌కు గురిచేసింది ఐశ్వర్య రాజేష్. తన కెరీర్ మొదట్లో ఎదురైన ఒక ఇబ్బందికర సంఘటనను వివరించింది. అప్పుడు నేను చాలా చిన్నపిల్లని. నా అన్నయ్యతో కలిసి ఒక ఫోటో షూట్‌కు వెళ్లాను. ఆ ఫోటోగ్రాఫర్ మా అన్నయ్యను బయట కూర్చోమని చెప్పి, నన్ను లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ నాకు లోదుస్తులు ఇచ్చి, అవి వేసుకోమని చెప్పాడు. నీ బాడీ ఎలా ఉంటుందో నేను చూడాలి అన్నాడు. ఆ మాటలకు నేను షాక్ అయ్యాను అని చెప్పుకొచ్చింది.
►ALSO READ | AATeaser: ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ఫిబ్రవరి 13న థియేటర్లలోకి 'అమరావతికి ఆహ్వానం'!
తొలుత ఏం చేయాలో తెలియక ఆ మాట వినాలని అనుకున్నా, ఏదో తప్పు జరుగుతోందని తన అంతరాత్మ హెచ్చరించిందని ఐశ్వర్య తెలిపింది. మా అన్నయ్య పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నానని, అప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ భయపడి వెనక్కి తగ్గాడని వివరించింది. అయితే ఈ విషయం గురించి తన అన్నయ్యకు ఎప్పుడూ చెప్పలేదని, తనలాగే ఎంతోమంది యువ నటీమణులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
సెట్స్‌లో దర్శకుడి అవమానం!
ఫోటోగ్రాఫర్లే కాకుండా, ఒక దర్శకుడు కూడా తనను అందరి ముందు అవమానించాడని ఐశ్వర్య గుర్తుచేసుకుంది. ఒకసారి షూటింగ్‌కు కొన్ని నిమిషాలు ఆలస్యంగా వెళ్లినందుకు, ఆ దర్శకుడు జూనియర్ ఆర్టిస్టుల ముందే తనను నోటికొచ్చినట్లు తిట్టాడని చెప్పింది. తిట్టడం సమస్య కాదు.. కానీ నన్ను వేరే హీరోయిన్లతో పోల్చుతూ కించపరచడం బాధ కలిగించింది. ఒక నటి తప్పు చేసినా, అందరి ముందు అంతలా అవమానించడం సరైంది కాదు అని ఆమె తన బాధను చెప్పింది
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా!
ఎన్ని అవమానాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా కష్టపడిన ఐశ్వర్య రాజేష్, నేడు తనకంటూ ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవల అర్జున్‌తో కలిసి నటించిన 'తీయవర్ కులైగల్ నడుంగ' , 2025లో వెంకటేష్ సరసన నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి.'కణా' (Kanaa) , 'వడ చెన్నై' చిత్రాల్లో ఆమె నటనకు గాను ఇటీవల ఉత్తమ నటిగా స్పెషల్ ప్రైజ్ అందుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగు నటుడు తిరువీర్ సరసన "ఓ..! సుకుమారి" అనే చిత్రంలో నటిస్తోంది. భారత్ దర్శన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
