అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ తన దారికి రావడం లేదని.. ఇరాన్ పౌరుల అణచివేత, అణు ఒప్పందంపై చర్చలకు రాని పక్షంలో భీకరంగా దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించడం, ఇరాన్చుట్టూ యుద్దనౌకలు, సైన్యాన్ని మోహరించడం మరోవైపు ఇరాన్ వ్యూహాత్మక ప్రాంతం హర్ముజ్ జలసంధిలో రెండు రోజుల సైనిక విన్యాసాలకు పిలుపునివ్వడం చూస్తుంటే.. అమెరికా, ఇరాన్ పై ఏ క్షణాన్నైనా సైనిక దాడికి దిగుతుందనే ఊహాగానాలు బలపడుతున్నాయి. ఒకవేళ అమెరికా, ఇరాన్‌పై దాడి చేస్తే ఏం జరగబోతుంది..?
మిడిల్ ఈస్ట్‌లో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న క్రమంలో ఇరాన్ చుట్టూ అమెరికా సైనిక బలాన్నిబలోపేతం చేసింది. ఇప్పటికే USS అబ్రహాం లింకన్ వంటి యుద్ద నౌకతోపాటు సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఇరాన్ పౌరుల అణచివేత, అణు ఒప్పందంపై చర్చలకు రాని పక్షంలో భీకరంగా దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.దీనికి ఇరాన్ కూడా అంతే ఘాటుగా బదిలిచ్చింది. యుద్దమే వస్తే ఎప్పుడూ చూడని రీతిలో దాడి చేస్తామని స్పష్టం చేసింది.
అమెరికా యుద్ధ నౌక అబ్రహం లింకన్ ,ఇతర యుఎస్ సైనిక బలగాలను మిడిల్ ఈస్ట్ లో మోహరించిన తర్వాత హార్ముజ్ జలసంధిలో రెండు రోజుల లైవ్-ఫైర్ నావికా విన్యాసాలను ఇరాన్ ప్రకటించింది. అయితే ఇరాన్ చర్యలపై అమెరికా మరోసారి తీవ్ర హెచ్చరికలు చేసింది. అమెరికా బలగాలపై ఎలాంటి దాడులు జరిగినా తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా ఇరాన్ సైన్యాన్ని హెచ్చరించింది. దీంతో టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై అణిచివేత ,ఇరాన్ అణు కార్యక్రమాన్ని తగ్గించాలని ట్రంప్ ఇరాన్ పై ఒత్తిడి పెంచారు. ఇరాన్ స్పందించకపోతే దాడి చేస్తామని పదే పదే హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ కూడా ధీటుగా బదిలిచ్చింది. యుద్దమేగనక వస్తే ఎప్పుడూ చూడని రీతిలో దాడి చేస్తామని స్పష్టం చేసింది. అయితే శుక్రవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ..న్యాయపరమైన చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని ట్రంప్ డిమాండ్లను తాము ఒప్పుకోబోమని ప్రకటించారు. రక్షణ వ్యూహాలు, క్షిపణి వ్యవస్థలు ఎప్పటికీ చర్చల అంశం కావని అరఘ్చి అన్నారు.
ఇదిలా ఉంటే ఇరాన్ ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్కారణమని మరోసారి ఇరాన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ట్రంప్, నెతన్యాహు యూరప్ లో ఆందోళనలను పెంచారని తద్వారా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఇరాన్ అధ్యక్షుడు మసౌజ్పెజెష్కియన్ ఆరోపించారు. ఇరాన్ పై అమెరికా దాడి చేస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ఇరాన్ భద్రతా అధికారి, ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ ప్రకటించారు. ఇరాన్ సైన్యాధ్యక్షుడు అమీర్ హతామి మాట్లాడుతూ..గత 12 రోజుల యుద్ధం తర్వాత దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేశామని , భవిష్యత్ దాడులకు ఇరాన్‌ను ధీటుగా సమాధానం చెబుతుందని చెప్పడం అమెరికా, ఇరాన్మధ్య యుద్దం తప్పదన్న వాదనలు బలపడుతున్నాయి.
హర్ముజ్ జలసంధిలో ఇరాన్ యుద్దనౌకల విన్యాసాలు..
గల్ఫ్ లో ఇరుకైన ముఖద్వారం హర్ముజ్ జలసంధి..ఇక్కడినుంచే ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు దారి. ఈ జలసంధిలో ఇరాన్ ,ఒమన్ దేశాలకు ప్రాదేశిక జలాలు ఉన్నప్పటికీ, దీనిని అన్ని దేశాల నౌకలు ప్రయాణించగల అంతర్జాతీయ జలమార్గంగా పరిగణిస్తారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఈ జలమార్గానికి సమీపంలోనే ఉంది.యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ కు ఈ జలసంధి చాలా కీలకమైన ప్రాంతం. ఇదే హర్ముజ్ జలసంధిలో ఆదివారం నుంచి రెండు రోజుల లైవ్-ఫైర్ నావికా విన్యాసాలను ఇరాన్ ప్రకటించింది. దీంతో మరికొద్ది గంటల్లోనే అమెరికా, ఇరాన్‌పై దాడులకు దిగుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
►ALSO READ | బలూచిస్తాన్‌లో రెచ్చిపోయిన వేర్పాటువాదులు: 10 మంది సైనికులతో సహా 37 మంది ఉగ్రవాదులు మృతి..
ఇరాన్‌కు దగ్గరగా అమెరికా యుద్ద నౌకలు మోహరింపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ పదే పదే ట్రంప్ హెచ్చరికల ప్రకటనలు.. మరోవైపు ఇరాన్ యుద్దానికి మేం సిద్దమన్నట్లు హర్ముజ్ జలసంధిలో సైనిక నౌకల విన్యాసాలకు ప్రకటన చేయడం చూస్తుంటే.. ఏక్షణాన్నైనా అమెరికా సైనిక చర్యలకు పాల్పడే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మిడిల్ ఈస్ట్ దేశాలు గట్టిగానే కృషి చేస్తున్నాయని స్థానిక కథనాలప్రకారం తెలుస్తోంది. ప్రత్యక్ష చర్చలు లేనప్పటికీ ఖతార్,తుర్కియే తోసహా ఇతర మిడిల్ దేశాలు మధ్యవర్తులుగా చర్చలు సాగిస్తున్నాయి.
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే..
ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు లక్ష్యంగా అమెరికా దాడి చేయొచ్చు. ఇరాన్ ,దాని ప్రాక్సీలు(హౌతీలు, హమాస్సంస్థలు) అమెరికా స్థావరాలు ,మిత్రదేశాలైన ఇజ్రాయెల్ ,గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇరాన్ గనక హార్ముజ్ జలసంధి ని మూసివేస్తే ప్రపంచ ఇంధన సరఫరాలకు అంతరాయం,ప్రాంతీయ అస్థిరత నెలకొనే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక, రాజకీయ పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ఇంధన ధరల భారీ పెరుగుదల (ముడి చమురు), స్టాక్ మార్కెట్ల పతనం, హార్ముజ్ జలసంధిలో వాణిజ్య అంతరాయం కలిగించవచ్చు. చమురు, గ్యాస్ ఎగుమతులకు తీవ్ర ఆటంకం ఎదురుకావచ్చు. పశ్చిమాసియాలో అస్థిరత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగి, ప్రపంచ ఆహార, రవాణా రంగాలు దెబ్బతింటాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
