IND vs NZ: బ్యాటింగ్‌లో శివాలెత్తిన టీమిండియా.. కిషాన్ విధ్వంసకర సెంచరీ.. సూర్య, పాండ్య మెరుపులు

IND vs NZ: బ్యాటింగ్‌లో శివాలెత్తిన టీమిండియా.. కిషాన్ విధ్వంసకర సెంచరీ.. సూర్య, పాండ్య మెరుపులు

న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా బ్యాటింగ్ లో శివాలెత్తింది. శనివారం (జనవరి 31) తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో కివీస్ బౌలర్లలకు చుక్కలు చూపించారు. ఇషాన్ కిషాన్ (44బంతుల్లో 103: 6 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసక సెంచరీ తో పాటు కెప్టెన్ సూర్య (30 బంతుల్లో 63: 4 ఫోర్లు, 6 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్ తో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. పాండ్య 17 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో  లాకీ ఫెర్గుసన్ కు రెండు వికెట్లు దక్కాయి.              

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు అభిషేక్ శర్మ ఎప్పటిలాగే తుఫాన్ ఆరంభం ఇచ్చాడు. తొలి ఓవర్లోనే 14 పరుగులు చేసి దూకుడు చూపించాడు. అయితే మరో ఎండ్ లో శాంసన్ మాత్రం తన పేలవ ఫామ్ ను కొనసాగించాడు. కేవలం 6 పరుగులే చేసి ఔటయ్యాడు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన అభిషేక్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ తో ఇండియా పవర్ ప్లే లో 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. ఈ దశలో సూపర్ ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషాన్, సూర్య కుమార్ యాదవ్ దుమ్ములేపారు.

►ALSO READ | IND vs NZ: మతిమరుపుతో స్టేడియాన్ని కంగారెత్తించిన సూర్య.. అసలేం జరిగిందంటే..?

ఆరంభంలో ఆచితూచి ఆడినా ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా కిషాన్ ఊరమాస్ ఇన్నింగ్స్ ఆడుతూ స్కోర్ కార్డును పరుగులు పెట్టించాడు. 9 ఓవర్లలో 82 పరుగులు చేసి పర్వాలేదనిపించిన ఇండియా ఆ తర్వాత అసలు విధ్వంసం చూపించింది. 10 ఓవర్లో కిషాన్, సూర్య ధాటికి 20 పరుగులు వచ్చాయి. ఇష్ సోది వేసిన 12 ఓవర్లో కిషాన్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా ఈ ఓవర్లో 28 పరుగులు కొట్టాడు. 4,4,4,6,4,6 కొట్టడంతో పాటు ఒక వైడ్ రూపంలో మొత్తం 29 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 28 బంతుల్లోనే కిషాన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డఫీ వేసిన 14 ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. ఇదే ఓవర్లో సూర్య 26 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని సాంట్నర్ విడగొట్టాడు. 

63 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్యను స్టంపౌట్ చేశాడు. మూడో వికెట్ కు వీరిద్దరి జోడీ ఏకంగా 137 పరుగులు జోడించడం విశేషం. సూర్య ఔటైన తర్వాత కిషాన్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో పాండ్య 17 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. చివరి నాలుగు ఓవర్లలో ఇండియా 70 పరుగులు చేయడంతో జట్టు స్కోర్ 271 పరుగులకు చేరింది.