రైతులకు గుడ్ న్యూస్.. కలుపు మొక్కల ఏరివేతకు ఏఐ డ్రోన్లు..మొత్తం పొలానికి మందు కొట్టాల్సిన పనిలేదు

రైతులకు గుడ్ న్యూస్.. కలుపు మొక్కల ఏరివేతకు  ఏఐ డ్రోన్లు..మొత్తం పొలానికి మందు కొట్టాల్సిన పనిలేదు
  •     కలుపు మొక్కలు ఉన్నచోటే స్పాట్ స్ప్రేయింగ్
  •     తగ్గనున్న పెస్టిసైడ్స్ వాడకం.. రైతులకూ ఖర్చు ఆదా
  •     హంగేరీలో సక్సెస్ అయిన కొత్త టెక్నాలజీ 

హైదరాబాద్, వెలుగు: పొలాల్లో కలుపు మొక్కల ఏరివేతకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. హంగేరీలోని సైంటిస్టులు ఏఐ డ్రోన్ల సాయంతో కలుపు మొక్కలపై విజయవంతంగా స్పాట్ స్ర్పేయింగ్ చేశారు. ఏఐ డ్రోన్లు పొలంలోని కలుపు మొక్కలను గుర్తించి, వాటిపైనే పెస్టిసైడ్స్‌‌‌‌ను స్ర్పే చేసేలా ఈ టెక్నాలజీని రూపొందించారు. దీనిపై హంగేరీలోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్ (ఎంఏటీఈ) పరిశోధకులు ఇటీవల రీసెర్చ్ పేపర్‌‌‌‌ పబ్లిష్ చేశారు. ఈ సాంకేతికతతో మొత్తం పొలానికి మందు కొట్టాల్సిన అవసరం లేదు. కేవలం కలుపు మొక్కలు ఉన్న చోటే స్ప్రే చేయడం ద్వారా రైతులకు డబ్బు ఆదా అవుతుంది.

పైగా పెస్టిసైడ్స్ వాడకం తగ్గి.. గాలి, నీటి కాలుష్యానికి చెక్ పడుతుంది. ఇప్పుడు రైతులు కలుపు నివారణకు మొత్తం పొలానికి మందు కొడుతున్నారు. దీనివల్ల ఖర్చు ఎక్కువ కావడంతో పాటు పర్యావరణానికి హాని జరుగుతున్నది. ఇప్పుడు సైంటిస్టులు రూపొందించిన ‘సైట్-స్పెసిఫిక్ వీడ్ మేనేజ్‌‌‌‌మెంట్’తో డ్రోన్ పొలాన్ని స్కాన్ చేసి వీడ్ మ్యాప్ తయారు చేస్తుంది. ఆ మ్యాప్ ఆధారంగా ట్రాక్టర్ లేదా స్ప్రేయింగ్ డ్రోన్ కేవలం కలుపు మొక్కలు ఉన్న చోటే మందు స్ప్రే చేస్తుంది. దీన్ని ‘వేరియబుల్ రేట్ టెక్నాలజీ’ అంటారు. 

కెమెరాలే కండ్లు..  

ఈ టెక్నాలజీలో డ్రోన్లకు అమర్చే కెమెరాలు కీలకం. వీటి గురించి రీసెర్చ్ పేపర్‌‌‌‌‌‌‌‌లో వివరించారు. ఆర్‌‌‌‌జీబీ కెమెరాలు సాధారణ ఫోన్ కెమెరాల్లాంటివి. ధర తక్కువ, కలుపు మొక్కలను బాగా గుర్తుపడతాయి. కానీ వెలుతురు తక్కువైతే సమస్య. మల్టీస్పెక్ట్రల్ కెమెరాలు కంటికి కనిపించని నియర్ ఇన్ఫ్రారెడ్ (ఎన్‌‌‌‌ఐఆర్) కిరణాలను పసిగడతాయి. మొక్కల ఆరోగ్యం, నీటి ఎద్దడిని తెలియజేస్తాయి. హైపర్‌‌‌‌స్పెక్ట్రల్ కెమెరాలు వందల రకాల రంగు తరంగాలను గుర్తిస్తాయి. పంట మొక్క, కలుపు మొక్కల మధ్య తేడాను కచ్చితంగా చెప్తాయి. కానీ ధర ఎక్కువ. ఎల్‌‌‌‌ఐడీఏఆర్, థర్మల్ కెమెరాలు మొక్కల ఎత్తు, నీటి శాతాన్ని కొలుస్తాయి. 

డీప్ లెర్నింగ్ సాయంతో.. 

డ్రోన్లు కేవలం ఫొటోలు తీయడమే కాదు.. వాటిలో కలుపు మొక్కలను గుర్తుపట్టడం ముఖ్యం. ఇక్కడే ఏఐ పాత్ర కీలకం. పాత మెషిన్ లెర్నింగ్ పద్ధతుల్లో ఎస్‌‌‌‌వీఎం, ర్యాండమ్ ఫారెస్ట్ వంటివి వాడేవారు. కానీ మ్యాన్‌‌‌‌వల్‌‌‌‌గా ఫీచర్లను ఎంచుకోవాలి. ఇప్పుడు డీప్ లెర్నింగ్ టెక్నాలజీతో మనుషుల ప్రమేయం లేకుండా సిస్టమ్ స్వయంగా ఆ పని చేసుకుంటుంది. సీఎన్‌‌‌‌ఎన్, యోలో, యూనెట్ వంటి అల్గారిథమ్‌‌‌‌లతో 98 శాతం కచ్చితత్వంతో కలుపు మొక్కలను గుర్తిస్తున్నారు. రంగు, ఆకృతి వంటి చిన్న తేడాలను కూడా పసిగడతాయి. 

సవాళ్లూ ఉన్నయ్.. 

ఈ సాంకేతికత అద్భుతమైనా కొన్ని సవాళ్లు ఉన్నాయి. గాలి వేగం, సూర్యకాంతి కోణం, మేఘాల నీడలు ఫొటో క్వాలిటీని ప్రభావితం చేస్తాయి. డ్రోన్లు ఎక్కువ సేపు ఎగరలేవు.. బరువు మోయలేవు. డ్రోన్ నిబంధనలు కఠినం. భారీ డేటాసెట్‌‌‌‌లు అవసరం. అయితే భవిష్యత్తులో డ్రోన్ల గుంపులు కలిసి పనిచేస్తాయి. ఎడ్జ్ కంప్యూటింగ్‌‌‌‌తో డ్రోన్‌‌‌‌లోనే డేటా ప్రాసెస్ చేస్తాయి. ప్రభుత్వాలు సబ్సిడీలు, శిక్షణ ఇస్తే ఈ సాంకేతికతను విస్తృతంగా అమలు చేయవచ్చు.

భవిష్యత్తు ఏఐ డ్రోన్లదే.. 

హంగేరీలో ‘కామన్ రాగ్‌‌‌‌వీడ్’గా పిలిచే ఆంబ్రోసియా మొక్క.. మన దేశంలోని ‘వయ్యారి భామ’లాంటిది. ఇది ప్రస్తుతం హంగేరీలో ప్రధాన సమస్యగా మారింది. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న వంటి పంటల్లో ఎక్కువగా వస్తున్నది. దీని పుప్పొడి వల్ల తీవ్రమైన అలర్జీలు వస్తాయి. హంగేరీ జనాభాలో 30 శాతం మంది అలర్జీలతో బాధపడుతుంటే, అందులో 60 శాతం మందికి ఈ మొక్కే కారణం. 

ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులతో ఆసుపత్రులకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ మొక్కను నియంత్రించడం రైతులకు పెద్ద సవాల్‌‌‌‌గా మారింది. హంగేరీలో ఆంబ్రోసియా మొక్కపై ఈ సాంకేతికత విజయవంతమైంది. భవిష్యత్తులో కలుపు మొక్కల నివారణలో ఏఐ డ్రోన్లదే కీలక పాత్ర అని సైంటిస్టులు అంటున్నారు. మన రాష్ట్రంలోనూ ఇలాంటి టెక్నాలజీ వినియోగం అవసరం. రైతులకు లాభదాయకంగా ఉంటుంది.