సిల్వర్ ఢమాల్ ..మార్చి ఫ్యూచర్ కాంట్రాక్టులో ఒక్కరోజే రూ. లక్షకు పైగా తగ్గుదల

సిల్వర్ ఢమాల్ ..మార్చి ఫ్యూచర్ కాంట్రాక్టులో  ఒక్కరోజే రూ. లక్షకు పైగా తగ్గుదల

న్యూఢిల్లీ: నిన్న మొన్నటి దాకా చుక్కలనంటిన వెండి ధర ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. గురువారం నాటి ధరల క్రాష్ శుక్రవారం కూడా కొనసాగింది. ఒక్క రోజే ఏకంగా రూ.లక్షకు పైగా తగ్గింది. మార్చి 2026 సిల్వర్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌‌‌‌లో శుక్రవారం రాత్రి భారీగా పతనం చోటుచేసుకుంది. గరిష్ఠ రికార్డు కిలో రూ.4,20,048 కు చేరిన ధర.. భారీ సెల్ ఆఫ్​కారణంగా రూ.2,91,922 కు పడిపోయింది. మార్చి కాంట్రాక్ట్ ఇంట్రాడే/ క్లోజ్ గురువారం రూ.3,99,893 నమోదు కాగా.. శుక్రవారం రాత్రి క్లోజ్ రూ.2,91,922 గా నమోదైంది. దీంతో ఒక్కరోజే 27 శాతం పడిపోయి కేజీ రూ.1,08,000  నష్టపోయింది. గడిచిన 15 ఏండ్లలో ఒక్కరోజులో నమోదైన అతిపెద్ద పతనం ఇదేనని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. డే రేంజ్ చూస్తే హైరేంజ్ రూ.3,89,986 నుంచి లో రూ.2,91,922 వరకు నమోదైంది. కాగా, వెండి ధర రికార్డు గరిష్ఠానికి చేరడంతో ట్రేడర్లు లాభాలను బుక్ చేసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ర్యాలీ ఓవర్ హీటెడ్ అయింది. అంతా అమ్మేవారే కానీ కొనేవారు లేకపోవడంతో ధర భారీగా పతనమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు, డాలర్ ఇండెక్స్ పెరగడంతో బులియన్ ధరలపై ఒత్తిడి కలిగి ధరలు పడిపోయాయని వివరించారు.

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరిగిన బంగారం, వెండి ధరలు శుక్రవారం తగ్గాయి.  ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 14 వేలు (7.65 శాతం) తగ్గి రూ. 1.69 లక్షల వద్ద ముగిసింది.  గురువారం బంగారం ధర రూ. 1.83 లక్షల గరిష్ట స్థాయిని తాకింది. కిలో వెండి ధర రూ. 20 వేలు తగ్గి రూ. 3.84 లక్షల వద్దకు చేరింది. క్రితం సెషన్ లో రూ. 4.04 లక్షల రికార్డు స్థాయికి చేరింది.  ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలోపేతం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది.   గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరగడంతో మదుపర్లు లాభాలను సొమ్ము చేసుకునేందుకు ఆసక్తి చూపారని, దీనివల్ల మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువయిందని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు.  

డాలర్ కోలుకోవడం కూడా ధరల తగ్గుదలకు కారణమైంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర 5.31 శాతం తగ్గి 5,087.73 డాలర్లకు పడిపోయింది. వెండి ధర  12.09 శాతం క్షీణించి 101.47 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ కాకుండా నివారించడానికి డొనాల్డ్ ట్రంప్, సెనేట్ డెమొక్రాట్లు ఒక తాత్కాలిక ఒప్పందానికి రావడం కూడా లోహాల ధరలపై ప్రభావం చూపింది. యూఎస్​ రిజర్వ్ కొత్త అధిపతిగా కెవిన్ వార్ష్ పేరును ట్రంప్ ప్రతిపాదించగా,  ఆయన కఠిన నిర్ణయాలు తీసుకుంటారనే భయాలు మార్కెట్‌లో కనిపించాయి.   ట్రెజరీ ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్ పెరగడంతో బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు తగ్గాయి.  హైదరాబాద్​లోనూ ఉదయం బంగారం ధర రూ.ఐదు వేలు, వెండి ధర రూ.30 వేల వరకు తగ్గిందని బులియన్​ వ్యాపారులు తెలిపారు. 

ఫ్యూచర్స్​ మార్కెట్లో వెండి రూ.67 వేలు డౌన్​ రిటైల్​తోపాటు ఫ్యూచర్స్ మార్కెట్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా పతనమయ్యాయి.  గత కొన్ని నెలల్లో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజులో అత్యంత తక్కువ స్థాయికి పడిపోయాయి. పెట్టుబడిదారులు తమ లాభాలను నగదుగా మార్చుకోవడానికి ఆసక్తి చూపడంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.  కేజీ వెండి ధర ఏకంగా రూ.67 వేలు తగ్గి రూ.3.32 లక్షలకు దిగివచ్చింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) లో మార్చి నెల కాంట్రాక్టు ధర 17 శాతం  తగ్గి రూ.3.32 లక్షల వద్ద ఆగింది. ఇది ఒకే రోజులో నమోదైన అతిపెద్ద పతనం.  బంగారం ధర కూడా భారీగా తగ్గింది. 10 గ్రాముల బంగారం విలువ 9 శాతం తగ్గి రూ.1.54 లక్షలకు పడిపోయింది. ఫిబ్రవరి నెల కాంట్రాక్టు ధర రూ.15 వేలు తగ్గి రూ.1.54 లక్షల వద్దకు చేరింది.  అన్ని రకాల కాంట్రాక్టులు లోయర్ సర్క్యూట్ స్థాయికి చేరుకున్నాయని, దేశీయ మార్కెట్లలో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్  (ఈటీఎఫ్) ధరలు 20 శాతం వరకు తగ్గాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్​ మానవ్ మోదీ తెలిపారు.  అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధర 16.87 శాతం తగ్గి ఔన్స్​ ధర 95.12 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధర కూడా 7.32 శాతం తగ్గి 4,962.7 డాలర్లకు పడిపోయింది.