న్యూజిలాండ్ తో జరిగిన ఐదో టీ20లో టీమిండియా అదిరిపోయే విజయాన్ని అందుకుంది. బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో సిరీస్ కు ఘనమైన ముగింపు ఇచ్చింది. శనివారం (జనవరి 31) తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 46 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను 4-1 తేడాతో గెలుచుకుంది. ఇషాన్ కిషాన్ (44బంతుల్లో 103: 6 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసక సెంచరీ తో పాటు కెప్టెన్ సూర్య (30 బంతుల్లో 63: 4 ఫోర్లు, 6 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్ తో ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఛేజింగ్ లో న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది.
272 పరుగుల భారీ ఎటెర్జెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కు మంచి ఆరంభంలోనే సీఫెర్ట్ (5) వికెట్ ను కోల్పోయింది. ఈ దశలో ఫిన్ అలెన్ (80) భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రచీన్ రవీంద్రతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అలెన్ విధ్వంసానికి కివీస్ పవర్ ప్లే లో ఏకంగా 79 పరుగులు చేసింది. ఈ క్రమంలో కేవలం 22 బంతుల్లోనే ఈ కివీస్ ఓపెనర్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్ ప్లే తర్వాత కూడా అలెన్ విధ్వంసం ఆగలేదు. బౌండరీలతో టీమిండియాకు కంగారెత్తించాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ కివీస్ ఓపెనర్ ను ఎట్టకేలకు అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో టీమిండియాకు బిగ్ రిలీఫ్ లభించింది.
►ALSO READ | IND vs NZ: కేక పెట్టించిన కిషాన్.. 42 బంతుల్లో సెంచరీ.. ఒకే ఓవర్లో 29 పరుగులు
తొలి 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి న్యూజిలాండ్ లక్ష్యం వైపు దూసుకెళ్లింది. అయితే ఈ దశలో టీమిండియా బౌలర్లు పుంజుకోవడంతో న్యూజిలాండ్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఫిలిప్స్ (7), సాంట్నర్ (0), రచీన్ రవీంద్ర (30) స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో న్యూజిలాండ్ ఛేజింగ్ లో వెనకపడింది. మిచెల్ 12 బంతుల్లో 26 పరుగులు చేసి కాస్త పోరాడినా లక్ష్యం మరీ పెద్దదిగా ఉండడంతో కివీస్ ఓటమి తప్పలేదు. చివర్లో సోది కొన్ని మెరుపులు మెరిపించినా అవి కివీస్ విజయానికి ఏ మాత్రం సరిపోలేదు.
ఇండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 5 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీసుకున్నాడు. రింకూ సింగ్,వరుణ్ చక్రవర్తి లకు తలో వికెట్ లభించింది.
ఇండియా భారీ స్కోర్:
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు అభిషేక్ శర్మ ఎప్పటిలాగే తుఫాన్ ఆరంభం ఇచ్చాడు. తొలి ఓవర్లోనే 14 పరుగులు చేసి దూకుడు చూపించాడు. అయితే మరో ఎండ్ లో శాంసన్ మాత్రం తన పేలవ ఫామ్ ను కొనసాగించాడు. కేవలం 6 పరుగులే చేసి ఔటయ్యాడు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన అభిషేక్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ తో ఇండియా పవర్ ప్లే లో 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. ఈ దశలో సూపర్ ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషాన్, సూర్య కుమార్ యాదవ్ దుమ్ములేపారు.
ఆరంభంలో ఆచితూచి ఆడినా ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా కిషాన్ ఊరమాస్ ఇన్నింగ్స్ ఆడుతూ స్కోర్ కార్డును పరుగులు పెట్టించాడు. 9 ఓవర్లలో 82 పరుగులు చేసి పర్వాలేదనిపించిన ఇండియా ఆ తర్వాత అసలు విధ్వంసం చూపించింది. 10 ఓవర్లో కిషాన్, సూర్య ధాటికి 20 పరుగులు వచ్చాయి. ఇష్ సోది వేసిన 12 ఓవర్లో కిషాన్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా ఈ ఓవర్లో 28 పరుగులు కొట్టాడు. 4,4,4,6,4,6 కొట్టడంతో పాటు ఒక వైడ్ రూపంలో మొత్తం 29 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 28 బంతుల్లోనే కిషాన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డఫీ వేసిన 14 ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. ఇదే ఓవర్లో సూర్య 26 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని సాంట్నర్ విడగొట్టాడు.
63 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్యను స్టంపౌట్ చేశాడు. మూడో వికెట్ కు వీరిద్దరి జోడీ ఏకంగా 137 పరుగులు జోడించడం విశేషం. సూర్య ఔటైన తర్వాత కిషాన్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో పాండ్య 17 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. చివరి నాలుగు ఓవర్లలో ఇండియా 70 పరుగులు చేయడంతో జట్టు స్కోర్ 271 పరుగులకు చేరింది.
𝐈𝐧𝐝𝐢𝐚 𝐯𝐬 𝐍𝐞𝐰 𝐙𝐞𝐚𝐥𝐚𝐧𝐝 - 𝟓𝐭𝐡 𝐓𝟐𝟎𝐈 ||
— All India Radio News (@airnewsalerts) January 31, 2026
India beat New Zealand by 46 runs, clinch series 4–1
Final Score:
IND 271/5(20)
NZ 225(19.4)
📍Greenfield International Stadium, Thiruvananthapuram #INDvNZ | #NZvIND pic.twitter.com/m9XuQ8avdP
