ఎప్పటిలాగే ప్రతినెల 1వ తేదీన అంటే రేపటి (ఫిబ్రవరి 1) నుండి కొన్ని రూల్స్ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు ప్రత్యక్షంగా సామాన్యులపై ప్రభావం చూపొచ్చు. అంతేకాకుండా కేంద్ర బడ్జెట్ 2026 కూడా రేపు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ లోని కొన్ని అంశాలు కూడా మీ ఆదాయం పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1 నుండి LPG సిలిండర్లు, సిగరెట్లు, ఫాస్ట్ ట్యాగులకు సంబంధించిన చాల నియమాలు, ధరలు మారనున్నాయి...
1. కొత్త LPG సిలిండర్ ధరలు
ఫిబ్రవరి 1న కొత్త LPG సిలిండర్ ధరలు ప్రకటిస్తారు. చమురు కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన LPG ధరలను సమీక్షిస్తాయి. దింతో LPG ధర పెరగవచ్చు లేదా తగ్గవచ్చు లేదా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధర కాస్త తగ్గగా.. మళ్ళి రేపు పెంచుతారో లేక తగ్గిస్తారో చూడాలి.
2. CNG, విమాన ఇంధన ధరలు
CNG, విమాన ఇంధన ధరలు రేపు ఫిబ్రవరి 1న కూడా మారవచ్చు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నందున, CNG, విమాన ఇంధన ధరలకు సంబంధించిన మార్పులను ఫిబ్రవరి 1న ప్రకటించే అవకాశం ఉంది. CNG ధరలు పెరిగితే ప్రయాణ ఖర్చులు పెరగవచ్చు. విమాన ఇంధన ధరల్లో మార్పులు కూడా విమాన ఛార్జీలను పెంచొచ్చు లేదా తగ్గించొచ్చు.
3. FASTag రూల్స్ మార్పులు
ఫాస్ట్‌ట్యాగ్‌ల కోసం KYC వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తిగా తొలగిస్తున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకటించింది . ఫిబ్రవరి 1 నుండి మీరు మీ ఫాస్ట్‌ట్యాగ్‌ను యాక్టివేట్ చేసిన తర్వాత KYC వెరిఫికేషన్ అవసరం లేదు. వాహనానికి సంబంధించిన వివరాలన్నీ చూసుకునే బాధ్యతను బ్యాంకులే తీసుకుంటాయి.
4. సిగరెట్లు, పాన్ మసాలా, పొగాకు ధరలు
ఫిబ్రవరి 1 నుండి పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు మీ జేబుపై భారం పెంచవచ్చు. ఈ ఉత్పత్తులపై పన్నులు పెంచడానికి ప్రభుత్వం ఇప్పటికే అన్ని సన్నాహాలు చేస్తోంది, అలాగే వాటి ధరలు భారీగా పెరుగవచ్చు.
5. క్రెడిట్ కార్డ్ రూల్స్
HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ కూడా ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వచ్చేలా క్రెడిట్ కార్డ్ రూల్స్ లో కొన్నింటిని మారుస్తున్నాయి. HDFC ఇన్ఫినియా మెటల్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు ఇప్పుడు నెలకు ఐదు సార్లు రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన క్రెడిట్ కార్డ్‌లపై BookMyShow ద్వారా అందించే ఫ్రీ సినిమా టికెట్ ఆఫర్‌ను ICICI బ్యాంక్ నిలిపివేస్తోంది.
