కింగ్ మేకర్ కాదు కింగ్ అవుతా.. అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా: టీవీకే చీఫ్ విజయ్

కింగ్ మేకర్ కాదు కింగ్ అవుతా.. అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా: టీవీకే చీఫ్ విజయ్

న్యూఢిల్లీ: రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను కింగ్ మేకర్ కాదు కింగ్ అవుతానని టీవీకే చీఫ్, యాక్టర్ విజయ్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కింగ్ మేకర్ ఉండటం తనకు ఇష్టం ఉండదని అన్నారు. శనివారం (జనవరి 31) ఓ నేషనల్ మీడియా చానల్‎కు ఇచ్చిన ఇంటర్వ్కూలో విజయ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నేను గెలుస్తా. కింగ్ మేకర్ ఎందుకు అవుతా..? నా సభలకు వస్తున్న జనసమూహాన్ని చూశారా..? అని అన్నారు. 

కరూర్ తొక్కిసలాట తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, అలాంటి విషాద ఘటన జరుగుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటన ఇప్పటికీ తనను వెంటాడుతోందన్నారు. ఇక.. ఎంజీఆర్, జయలలిత తనకు రాజకీయాల్లో ఆదర్శమని చెప్పారు. తాను బాలీవుడ్ స్టార్ యాక్టర్ షారుఖ్ ఖాన్ అభిమానినని విజయ్ పేర్కొన్నాడు. తన జన నాయగన్ సినిమా విడుదల కాకపోవడంతో నిర్మాత బాధపడుతున్నారని.. కానీ రాజకీయాల్లో భాగంగా తన సినిమాలను టార్గెట్ చేస్తారని ముందే ఊహించానని తెలిపారు. 

రాజకీయాల్లోకి వచ్చే ముందే ఇలాంటి వాటన్నింటికీ మానసికంగా సిద్ధపడి వచ్చానని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో తాను దశాబ్దాల పాటు స్టార్‌గా ఉన్నానని.. ఇప్పుడు తన దృష్టంతా రాజకీయాలపై పెట్టానని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయం చేయాలనుకుంటున్నానని తెలిపారు. టీవీకే ఎన్నికల చిహ్నంగా ఈసీ విజిల్‌ను కేటాయించడం తమ మొదటి విజయమని అభివర్ణించారు.