ఇండియా, శ్రీలంక వేదికలుగా జరగనున్న 2026 టీ20 వరల్డ్ కప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన స్క్వాడ్ లో స్టార్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ కు చోటు దక్కలేదు. ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ ఆడుతూ సూపర్ ఫామ్ లో ఉన్న స్మిత్ తన దీర్ఘకాలిక లక్ష్యం గురించి చెప్పుకొచ్చాడు. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028లో జరగనున్నాయి. ఈ విశ్వ క్రీడల్లో క్రికెట్ రీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో అన్ని దేశాలు తమ జట్లకు గోల్డ్ మెడల్ అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ కూడా 2028 ఒలింపిక్స్ ఆడాలనే తమ కోరికను తెలిపారు.
స్మిత్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.. " నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు జట్టులో చేరడమే నా ప్రధాన లక్ష్యం. నేను ఎలాగైనా కష్టపడి ఆ సమయంలో జట్టులోకి రావాలని కోరుకుంటున్నాను. ఒలింపిక్స్ ఆడడం చాలా బాగుంటుంది. నేను జట్టులో స్థానం కోసం పోరాడుతూనే ఉంటాను". అని బిగ్ బాష్ లీగ్ లో మ్యాచ్ ఆడిన తర్వాత స్మిత్ తన కోరికను వెల్లడించాడు. స్మిత్ 2028 ఒలింపిక్స్ లో ఆడడం దాదాపుగా అసాధ్యం. ప్రస్తుతం ఆసీస్ టీ20 జట్టులో స్థానం కోల్పోయిన స్మిత్ మరో మూడేళ్లు జట్టులో కొనసాగడం కష్టమనే చెప్పాలి. ఇటీవలే స్మిత్ ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బాష్ లీగ్ లో అద్భుతంగా ఆడాడు.
బిగ్ బాష్ లీగ్ లో అదరగొడుతున్న స్మిత్:
బిగ్ బాష్ లీగ్ లో భాగంగా స్టీవ్ స్మిత్ అద్భుతంగా ఆడుతున్నాడు. శుక్రవారం ( జనవరి 16) జరిగిన మ్యాచ్ లో సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్న స్మిత్.. సిడ్నీ థండర్స్ పై పూనకం వచ్చినట్టు ఆడాడు. 41 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్..ఓవరాల్ గా 42 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతేకాదు ఈ రోజు (జనవరి 23) హోబర్ట్ హరికేన్స్ తో జరిగిన ఛాలెంజర్ మ్యాచ్ లో స్మిత్ 43 బంతుల్లోనే 65 పరుగులు చేసి తమ జట్టును ఫైనల్ కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఫైనల్లో తన జట్టును గెలిపించలేకపోయాడు. మరి టీ20 క్రికెట్ లోకి అడుగుపెట్టి స్మిత్ త డ్రీమ్ తీర్చుకుంటాడో లేదో చూడాలి.
