ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు సిట్ మరోసారి నోటీసులిచ్చింది. బంజారాహిల్స్ లోని కేసీఆర్ ఇంట్లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు సిట్ అధికారులు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపింది. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లోనే విచారించాలన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. హైదరాబాద్ నందినగర్లోని నివాసంలో అందుబాటులో ఉండాలని కేసీఆర్ కు సూచించింది.
‘మా రికార్డుల్లో నందినగర్ అడ్రస్ ఉంది .. ఫామ్ హౌస్ అడ్రస్ లేదు కాబట్టి అక్కడ విచారించలేం. ఈ విచారణలో కొన్ని ఎలక్ట్రానిక్, భౌతిక రికార్డులు ఉన్నందున ఫామ్ హౌస్ కు తరలించడం కష్టం అని సిట్ నోటీసుల్లో తెలిపింది.
ఫామ్ హౌస్ లో విచారించండి
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని జనవరి 29న 160 సీఆర్ పీసీ కింద సిట్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండగా..బంజారాహిల్స్ లోని నందినగర్ లో ఆయన నివాసంలో అధికారులు నోటీసులు అందించారు. జనవరి 30న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని తెలిపారు.
అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనవరి 30న విచారణకు హాజరుకాలేనని సిట్ అధికారులకు కేసీఆర్ లేఖ రాశారు. సిద్దిపేట ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లోనే విచారించాలని అధికారులను రిక్వెస్ట్ చేశారు. అలాగే భవిష్యత్ లోనే ఎలాంటి నోటీసులైనా..ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ అడ్రస్ కే పంపాలని విన్నవించారు.
కేసీఆర్ రిక్వెస్ట్ తిరస్కరణ
అయితే కేసీఆర్ రిక్వెస్ట్ పై ఇవాళ న్యాయ నిపుణులతో చర్చించిన సిట్ ఫామ్ హౌస్ లోనే విచారించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో విచారిస్తామని మరో నోటీసు జారీ చేసింది.
