ఇరాన్ యుద్ధంతో గోల్డ్, సిల్వర్, డాలర్లకు మించిపోయిన క్రిప్టోలు.. బిట్‌కాయిన్ లాభాల వర్షం

ఇరాన్ యుద్ధంతో గోల్డ్, సిల్వర్, డాలర్లకు మించిపోయిన క్రిప్టోలు.. బిట్‌కాయిన్ లాభాల వర్షం

ఇరాన్ యుద్ధంతో ప్రపంచ మార్కెట్లు వణికిపోతున్నాయి. సాధారణంగా ఇలాంటి అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లందరూ సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు పరుగులు తీస్తారు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. ఎవరూ ఊహించని విధంగా డిజిటల్ కరెన్సీ 'బిట్‌కాయిన్' సహా ఇతర క్రిప్టో అసెట్స్ సరికొత్త సేఫ్ హెవెన్ గా అవతరించాయి. ఫిబ్రవరి చివరిలో ఇరాన్ సంఘర్షణ మొదలైనప్పటి నుంచి బంగారం ఆశించిన స్థాయిలో రాణించకపోగా.. బిట్‌కాయిన్ మాత్రం సైలెంట్ గా పుంజుకుంటూ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది.

గత కొద్ది రోజుల్లోనే బిట్‌కాయిన్ దాదాపు 12 శాతం మేర వృద్ధి చెంది 74వేల 500 డాలర్ల స్థాయిని తాకింది. ఇది గత 6 వారాల్లోనే అత్యధికం. యుద్ధ సమయంలో బంగారం ధరలు సుమారు 5 శాతం మేర పడిపోతే, బిట్‌కాయిన్ మాత్రం పరుగు తీయడం మార్కెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం బిట్‌కాయిన్ మాత్రమే కాదు.. ఎథీరియం 10 శాతం, సోలానా, ఎక్స్‌ఆర్‌పీ వంటి కరెన్సీలు కూడా 8 నుండి 9 శాతం వరకు లాభపడ్డాయి. దీనిని బట్టి చూస్తుంటే ఇన్వెస్టర్లు సంప్రదాయ పెట్టుబడుల కంటే డిజిటల్ ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ మార్పుకు ప్రధాన కారణం ఇన్‌స్టిట్యూషనల్ మనీ క్రిప్టో మార్కెట్లోకి వెల్లువెత్తడమే. అమెరికాలోని స్పాట్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్ లలోకి గత వారమే దాదాపు 763 మిలియన్ డాలర్ల నికర పెట్టుబడులు వచ్చాయి. మార్చి నెలలో ఇప్పటివరకు మొత్తం ఇన్ఫ్లోలు 1.3 బిలియన్ డాలర్లను దాటేశాయి. అంటే సామాన్య ఇన్వెస్టర్లే కాకుండా పెద్ద పెద్ద ఫైనాన్షియల్ సంస్థలు కూడా యుద్ధం వంటి క్లిష్ట సమయాల్లో బిట్‌కాయిన్‌ను ఒక ప్రత్యామ్నాయ ఆస్తిగా చూస్తున్నాయి.

మరోవైపు.. బంగారం ఎందుకు వెనుకబడిందనే దానికి బలమైన కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలపడటం వల్ల ఇతర దేశాల వారికి బంగారం ఖరీదైనదిగా మారింది. అలాగే క్రూడ్ ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం పెరిగి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే అంచనాలు కూడా బంగారానికి ప్రతిబంధకంగా మారాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు.. ఎలాంటి వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం కంటే ఇతర ఆస్తుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారు.

అయితే బిట్‌కాయిన్ నిజంగానే బంగారానికి ప్రత్యామ్నాయంగా మారిపోయిందా అంటే.. నిపుణులు ఇంకా సందేహం వ్యక్తం చేస్తున్నారు. బిట్‌కాయిన్ ఇంకా 'హై-రిస్క్' ఆస్తిగానే పరిగణించబడుతోంది. ఇది యుద్ధ సమయంలో పెరిగినప్పటికీ, సెంట్రల్ బ్యాంకుల మద్దతు దీనికి లేదు. అయినప్పటికీ ప్రస్తుత గ్లోబల్ సంక్షోభంలో బంగారం, వెండిని వెనక్కి నెట్టి 'డిజిటల్ గోల్డ్'గా పిలవబడే బిట్‌కాయిన్ సృష్టించిన ఈ మార్పు ఒక సరికొత్త ఫైనాన్షియల్ ట్రెండ్‌కు నాంది పలుకుతోంది. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ మార్కెట్ సమీకరణాలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.