సికింద్రాబాద్: చూస్తేనే వాంతొచ్చేలా ఉన్న 800 కిలోల చికెన్.. రోజులకు రోజులు నిల్వ చేసి.. వైన్స్, బార్లకు అమ్ముతున్నారు. సికింద్రాబాద్ పార్సీ గుట్టలో ఈ దారుణం వెలుగుచూసింది. A-1 ఫ్రెష్ చికెన్ షాప్పై సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, GHMC అధికారుల జాయింట్ ఆపరేషన్లో ఈ విషయం బయటపడింది. చాలా రోజుల నుంచి నిల్వ ఉంచిన చికెన్ అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.
టాస్క్ ఫోర్స్ పోలీసులు 800 కిలోల చికెన్ స్వాధీనం చేసుకున్నారు. వైన్స్కు, బార్ అండ్ రెస్టారెంట్లకు ఈ చికెన్ సప్లై చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత జనవరి నెలలోనే లైసెన్స్ అయిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి.. షాపు నిర్వాకుడు షకీల్తో పాటు మరి కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెండేళ్ల క్రితం.. 2024 అక్టోబర్లో కూడా హైదరాబాద్లోని బేగంపేట ప్రకాశ్ నగర్లో 7 క్వింటాళ్ల కుళ్లిన చికెన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్ఎంసీకి చెందిన ఆహార భద్రతా విభాగం అధికారులు ప్రకాశ్ నగర్లోని బాలయ్య చికెన్ సెంటర్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బేగంపేటప్రకాశ్నగర్కు చెందిన బాలయ్య (36) పది నెలల క్రితం అదే ప్రాంతంలో బాలయ్య చికెన్ సెంటర్ పేరుతో షాపు ఓపెన్ చేశాడు. కోడి కాళ్లు, తల, ఇతర భాగాలను సేకరించి తన షాపులోని ఫ్రిజ్లో భద్రపరుస్తున్నాడు.
అలా దాచిన చికెన్ను సిటీలోని బార్లు, కల్లు దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అమ్ముతున్నాడు. నెల రోజుల క్రితం సేకరించి దాచిపెట్టిన చికెన్, ఎముకలు, తల, ఇతర భాగాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదంతా కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఆ మాంసానికి కెమికల్స్వేసి వివిధ దుకాణాలకు అమ్ముతున్నాడని అధికారులు గుర్తించారు.
