బీఆర్ఎస్ పార్టీ హయాంలో మహిళలకు ఇచ్చిన గౌరవం ఏంటో.. అప్పట్లో వాళ్ల కేబినెట్ చూస్తేనే తెలుస్తుందన్నారు మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో.. ఎమ్మెల్యే కేటీఆర్ ప్రస్తావించిన అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రులు.
మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ఓ విదేశీ కంటెస్టెంట్ చేసిన ఆరోపణలను సభలో ప్రస్తావించారు ఎమ్మెల్యే కేటీఆర్. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రులు.. కేటీఆర్ తీరును తప్పుబట్టారు.
బయట ఎవరో ఏదో అన్నారని.. ఆ అంశాన్ని సభలో ఎలా ప్రస్తావిస్తారంటూ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలను మహాలక్ష్మిలను చేసిన ఘనత మాదే అని.. ఉచిత బస్సు పథకంతో మహిళా కుటుంబాల్లో ఆదాయం పెంచామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లల్లోనే 57 వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలుగా ఇచ్చినట్లు స్పష్టం చేశారు మంత్రులు.
బీఆర్ఎస్ పార్టీ 5 లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణాలు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా గ్రూపులకు 20 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు మంత్రులు.
బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో 77 వేల కోట్ల రూణాలు ఇచ్చినట్లు చెబుతున్నారని.. ఇందులోనూ 5 లక్షల రూపాయల వరకే ఇచ్చారని.. కాంగ్రెస్ రెండేళ్ల హయాంలోనే 57 వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణంగా ఇచ్చినట్లు వివరించారు మంత్రులు భట్టి, సీతక్క.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మహిళలకు ఆత్మగౌరవం తిరిగి వచ్చిందని.. బీఆర్ఎస్ హయాంలో మహిళా మంత్రినే లేరనే విషయాన్ని కేటీఆర్ కు గుర్తు చేస్తూ కౌంటర్ ఇచ్చారు మంత్రులు.
తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా బ్యాంక్ రీపేమెంట్ 98 శాతంగా ఉందని.. స్త్రీ నిధి, స్త్రీ శక్తి పథకాల కింద వడ్డీ లేని రుణాలతో.. మహిళలు స్వయం సమృద్ధి దిశగా వెళుతున్నట్లు వెల్లడించారు మంత్రులు.
బ్యాంక్ లింకేజ్ ద్వారా 57 వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణంగా అందించి.. మహిళలను మహాలక్ష్మిలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు మంత్రులు.
