లంచం తీసుకుంటున్న ఘటనలు ఇటీవల చాలా పెరిగిపోయాయి. కిందిస్థాయి ఉద్యోగి నుంచి వైట్ కాలర్ జాబ్ హోల్డర్ వరకు ప్రభుత్వ ఉద్యోగులు లంచం కేసుల్లో పట్టుబడుతున్నారు. లంచం తీసుకోవడం ద్వారా అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. చిన్న ఉద్యోగి దగ్గర కూడా కోట్లలో అక్రమాస్తులు బయట పడుతున్నాయి. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బెంగళూరులో లంచం తీసుకుంటూ ఓ ఎస్సై రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు.. వివరాల్లోకి వెళితే..
ఓ ఫ్రాడ్ కేసులో బిల్డర్నుంచి రూ.4లక్షలు లంచం తీసుకుంటుండగా గురువారం(జనవరి 29) బెంగళూరుకు చెందిన సబ్ ఇన్ స్పెక్టర్ ను కర్ణాటక లోకాయక్త పోలీసులు అరెస్ట్ చేశారు. సిటీలో కేపీ అగ్రహారం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సబ్ ఇన్ స్పెక్టర్ గోవిందరాజులు స్థానిక బిల్డర్ మహ్మద్ అక్బర్ నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఫ్రాడ్ కేసులో అరెస్ట్ అయిన బిల్డర్ కు బెయిల్ ఇప్పిస్తానని అందుకు రూ. 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు లోకాయుక్త అధికారులు వెల్లడించారు. మొదట బిల్డర్ నుంచి రూ.లక్ష అడ్వాన్స్ గా తీసుకున్న ఆ ఇన్ స్పెక్టర్. రెండో విడత బిల్డర్ నుంచి రూ. అడ్వాన్స్‌గా 4 లక్షలు నగదు తీసుకుంటుండగా పక్కా ప్రణాళికతో గోవిందరాజును పట్టుకున్నారు. రూ.4లక్షల విలువైన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
