కలియుగ దైవం తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నేయ్యి కేసుకు సంబంధించి ఇటీవల ఫైనల్ చార్జిషీట్ సమర్పించింది సీబీఐ సిట్. దీంతో ఈ అంశంపై మళ్ళీ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. తిరుమల లడ్డూ తయారీ కోసం వాడిన నెయ్యిలో జంతు కొవ్వు లేదంటూ సిట్ చార్జిషీట్ లో తేలిందని వైసీపీ అంటుంటే.. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు చార్జిషీట్లో తేలిందని కూటమి నేతలు అంటున్నారు. ఈ క్రమంలో ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉన్నట్లు సిట్ చార్జిషీట్ లో స్పష్టం అయ్యిందని అన్నారు.
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై క్లీన్ చిట్ అంటూ భక్తులను మోసం చేస్తున్నారని.. టిటిడి పవిత్రతను భ్రష్టు పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు బీఆర్ నాయుడు. నెయ్యి కల్తీ జరగలేదని చెప్పడం వాస్తవం కాదని, సిట్ ఛార్జ్‌షీట్‌లోనే కల్తీ స్పష్టంగా నమోదు అయిందని అన్నారు. నెయ్యి కొనుగోలు టెండర్ల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘన జరిగిందని.. కొందరికి లాభం చేకూర్చే విధంగా నిబంధనలను మార్చారని అన్నారు బీఆర్ నాయుడు.
సరైన సామర్థ్యం లేని సంస్థలకు నెయ్యి టెండర్లు అప్పగించారని... సుమారు రూ. 250 కోట్ల రూపాయలతో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు జరిగిందన్నారు. ఈ నెయ్యిని పరీక్షించిన NDDB జంతు కొవ్వు ఉందని నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. ఒక్క ఆవు కూడా లేకుండా, చుక్క నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా నెయ్యి తయారు చేశామని చెప్పడం అబద్ధమని, నెయ్యి తయారీలో వాడిన కొన్ని రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవని ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ నాయుడు.
ఈ కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం ద్వారా తిరుమల క్షేత్ర పవిత్రతకు తీవ్రమైన భంగం కలిగించారని... కమిషన్ల కోసమే కొన్ని డైరీలను ఎంపిక చేశారని అన్నారు బీఆర్ నాయుడు. హైందవ సమాజాన్ని నాశనం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారన్నారని... గత ఐదేళ్ళలో హిందూ దేవుళ్ళను, హిందూ సమాజాన్ని హేళన చేశారని, వారంతా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని అన్నారు బీఆర్ నాయుడు.
క్లీన్ చిట్ వచ్చిందని ప్రచారం చేయడం వాస్తవాలకు విరుద్ధమని ఆయన తెలిపారు. నెయ్యి నాణ్యతపై తుది నిజాలు వెలుగులోకి రావాలంటే మైక్రో డీఎన్ఏ టెస్ట్ తప్పనిసరిగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఖాతాల్లోకి వెళ్లిన కోట్ల రూపాయల లావాదేవీలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని సిట్‌ను కోరారు బీఆర్ నాయుడు. బ్యాంక్ ఖాతాలలో కోట్ల రూపాయలు జమ కావడం వాస్తవమా కాదా, బినామీల వెనుక అసలు పెద్దలు ఎవరో నిగ్గుతేల్చాలని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, టిటిడి పవిత్రతను కాపాడేందుకు ఎలాంటి రాజీ ఉండదని అన్నారు బీఆర్ నాయుడు.
