ఇంటర్నెట్ లేనిదే ఈ కాలంలో ఏ పని చేయలేము. ఏ చిన్న పనికైనా, అవసరానికన్నా ఇంటర్నెట్ ఇండాల్సిందే... అయితే 2025 నాటికి మన దేశంలో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య 95 కోట్లు దాటింది. దింతో ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న డిజిటల్ మార్కెట్‌గా అవతరించింది. ఈ లెక్కలు ఆశ్చర్యంగా అనిపించినా, ప్రస్తుతం ఇండియాలో ఇంటర్నెట్ వాడే వారిలో 57 శాతం మంది అంటే సుమారు 54.8 కోట్ల మంది గ్రామాల్లోని వారే. పట్టణ ప్రాంతాల కంటే గ్రామాల్లోనే ఇంటర్నెట్ వాడకం 4 రెట్లు వేగంగా పెరుగుతోంది. IAMAI గురువారం ఈ సమాచారాన్ని విడుదల చేసింది.
AI వాడకం: దాదాపు 44 శాతం మంది భారతీయులు వాయిస్ సెర్చ్, చాట్‌బాట్స్, ఫోటో ఫిల్టర్ల వంటి AI(కృత్రిమ మేధ) ఫీచర్లను వాడుతున్నారు. ముఖ్యంగా 15 నుండి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లే ఇందులో ఎక్కువగా ఉన్నారు.
షార్ట్ వీడియోల క్రేజ్: రీల్స్, షార్ట్ వీడియోలు చూసే వారి సంఖ్య 58 కోట్లకు చేరింది. నగర వాసుల కంటే గ్రామీణ ప్రాంత ప్రజలే ఈ షార్ట్ వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు.
షాపింగ్ స్టైల్ మారింది: ఆన్‌లైన్ షాపింగ్ కేవలం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటికే పరిమితం కాకుండా, నిమిషాల్లో డెలివరీ ఇచ్చే క్విక్ కామర్స్ యాప్స్ వైపు మళ్లుతోంది. పట్టణాల్లో దాదాపు 23 కోట్ల మంది ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడకం: గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 18 శాతం మంది ఇతరుల ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ వాడుతున్నారు. అలాగే ఒక వ్యక్తి ఫోన్, ట్యాబ్, లాప్‌టాప్ వంటి ఒకటి కంటే ఎక్కువ డివైజెస్లో ఇంటర్నెట్ వాడటం కూడా పెరిగింది.
డిజిటల్ ఇండియా : దేశంలో ఇంకా 38 శాతం మంది అంటే సుమారు 58 కోట్ల మంది ఇంటర్నెట్‌కు దూరంగానే ఉన్నారు. అయితే ఈ సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది, అంటే రాబోయే రోజుల్లో డిజిటల్ ఇండియా ఇంకా బలోపేతం కానుంది.
AI వాడకంలో యువత : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడటంలో యువత చాలా ముందుందని ఈ రిపోర్ట్ చెబుతోంది. 15-24 ఏళ్ల మధ్య వయస్సు వారిలో 57 శాతం మంది AI ఫీచర్లను వాడుతున్నారు. 25-44 ఏళ్ల మధ్య వయస్సు వారిలో 52 శాతం మంది గత ఏడాది AIని ఉపయోగించారు.
పెరుగుతున్న గ్యాడ్జెట్ల వాడకం: మన దేశంలో ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లలో అంటే ఫోన్, లాప్‌టాప్ లేదా టాబ్లెట్ లో ఇంటర్నెట్ వాడటం బాగా పెరిగింది. ప్రస్తుతం భారతదేశంలో 19.3 కోట్ల మంది ఇలా ఒకటి కంటే ఎక్కువ పరికరాల్లో ఇంటర్నెట్ వాడుతున్నారు. అంటే మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో 20 శాతానికి సమానం. 2024లో ఈ సంఖ్య 16.5 కోట్లుగా ఉండగా, కేవలం ఏడాదిలోనే భారీగా పెరిగింది.
ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI), కాంటార్ (KANTAR) కలిసి రూపొందించిన ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2025ను 'ఇండియా డిజిటల్ సమ్మిట్'లో విడుదల చేశారు. ఈ రిపోర్ట్ దేశవ్యాప్తంగా 400 పట్టణాలు, 1000 గ్రామాల్లోని సుమారు లక్ష మంది నుండి సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించారు.
