డిన్నర్ చేయడానికే మొయినాబాద్ ఫామ్ హౌస్ కు వెళ్ళా: ఎంపీ పుట్టా మహేష్ 

డిన్నర్ చేయడానికే మొయినాబాద్ ఫామ్ హౌస్ కు వెళ్ళా: ఎంపీ పుట్టా మహేష్ 

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ పార్టీపై అందిన సమాచారంతో ఫామ్ హౌస్ పై దాడి చేసిన ఈగల్ టీం పోలీసులు ఏపీ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్ మంజూరు కాగా.. మిగతా నిందితులకు రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై స్పందిస్తూ వీడియో రిలీజ్ చేశారు ఎంపీ మహేష్ కుమార్. డిన్నర్  చేయడానికే మొయినాబాద్ ఫామ్ హౌస్ కు వెళ్లానని అన్నారు మహేష్ కుమార్.

తాను ఎక్కడ, ఏ తప్పు చేయలేదని అన్నారు మహేష్. ఎప్పటి నుంచో తనను కలవాలని కొంతమంది వ్యక్తులు అడిగారని.. శనివారం కుదరడంతో వాళ్ళను కలిసేందుకు వెళ్లానని.. ఫామ్ హౌస్ లో డిన్నర్ చేసేందుకే వెళ్లానని అన్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చే కథనాలు నమ్మొద్దని అన్నారు మహేష్ కుమార్.ఏలూరు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయనని.. ఎప్పుడూ ఏ తప్పు చేయనని అన్నారు మహేష్ కుమార్.

►ALSO READ | మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్..

ఇదిలా ఉండగా..మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో పాటు తన సోదరుడు రితేష్ రెడ్డి, తన మిత్రుడు నమిత్ శర్మాలకు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి మెజిస్ట్రేట్. నిందితుల తరపున వేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది కోర్టు.నిందితులను చంచల్ గూడా జైలుకు తరలించారు పోలీసులు.