సిధారెడ్డికి సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడం తెలంగాణకు గర్వకారణం: సీఎం రేవంత్

సిధారెడ్డికి సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడం తెలంగాణకు గర్వకారణం: సీఎం రేవంత్

హైదరాబాద్: కేంద్ర సాహిత్య అకాడమీ-2025 అవార్డ్ దక్కించుకున్న తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిన కవి నందిని సిధారెడ్డి  రాసిన “అనిమేష” కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు.

సిధారెడ్డి కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాలను, మానవ సంబంధాల విచ్ఛిన్నతలను చిత్రీకరించడంవల్ల తనకు సమాజంపట్ల ఉన్న నిబద్ధతను, అలాగే తనలోనున్న ఆర్ద్రతను తెలియజేస్తుందని కొనియాడారు. ఆయన గొప్ప మానవతావాదని అన్నారు. 

సిధారెడ్డి సుదీర్ఘ సాహిత్య కృషికి లభించిన గౌరవమని, తెలంగాణ మలిదశ ఉద్యమంలో  అక్షరాన్ని ఆయుధంగా మలిచి ప్రజల్లో చైతన్యం నింపడంలో వారు పోషించిన పాత్ర చిరస్మరణీయమని ప్రశంసించారు. ఆధునిక తెలుగు కవిత్వంలో నందిని సిధారెడ్డి ఎన్నో పరిశోధనాత్మక రచనలతో సాహితీ రంగానికి విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడం ఆయన సాహిత్య ప్రస్థానానికి దక్కిన గౌరవమని అన్నారు. సాహితీ రంగంలో సిధారెడ్డి మరెన్నో శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.