Gambhir– MS Dhoni: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నవ్వడం చాలా తక్కువగా చూస్తుంటాం.. ఎల్లప్పుడూ సీరియస్ గానే కనిపించే గంభీర్ ముఖంపై అప్పుడప్పుడు మాత్రమే చిరునవ్వులు చూసే భాగ్యం కలుగుతుంది. ఇటీవల టీమిండియా ప్రపంచకప్-2026 గెలిచిన తర్వాత గౌతీ నవ్వులు చిందించడం క్రికెట్ ఫ్యాన్స్ ని కనువిందు చేసింది. దీంతో మాజీ దిగ్గజ కెప్టెన్, భారత్ కు 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోని సైతం గంభీర్ నవ్వుపై తన సోషల్ మీడియా అకౌంట్లో కామెంట్ చేశాడు. టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతూ గంభీర్ ని ఉద్దేశించి మిస్టర్ కూల్ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.
కోచ్ సాహెబ్.. మీ ముఖంపై నవ్వు ఎంతో అందంగా ఉంటుంది. గంభీరమైన ముఖంలో ఆ చిరు నవ్వు.. అదొక కిల్లర్ కాంబో అంటూ ఎంఎస్ ధోనీ పేర్కొన్నారు. ఇందుకు సమాధానంగా.. నవ్వులు చిందించేందుకు ఇంతకంటే గొప్ప కారణం ఇంకా ఏమైనా ఉందా!.. నిన్ను మైదానంలో చూడటం సంతోషంగా ఉందని గంభీర్ రిప్లై ఇచ్చారు. కాగా ధోని ఈసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కి హాజరైన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్ ని 96 పరుగులతో ఓడించి భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీని దక్కించుకున్న దృశ్యాలను మహేంద్రుడు ప్రత్యక్షంగా వీక్షించాడు. దీంతో
తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన గంభీర్.. ఎంఎస్ ధోని 'స్మైల్ కామెంట్' గురించి ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ప్రపంచకప్ ఫైనల్ చూసేందుకు ధోని అక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తను నన్ను నవ్వమని అడగటం కూడా బాగా నచ్చింది.. ఏదో ఒక రోజు ధోనీ కూడా నా స్థానంలో ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నాను.. అప్పుడు నేను కూడా ధోని గురించి అదే కోట్ రాస్తానని చెప్పుకొచ్చాడు. అతడు కూడా డగౌట్ లో కూర్చుని నవ్వుతుంటే చూడాలని ఉందని గంభీర్ వెల్లడించారు. తనలాగే మహేంద్ర సింగ్ ధోని టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టి.. కోచ్ హోదాలో ఐసీసీ ట్రోఫీ గెలవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
కాగా 2007లో ఐసీసీ మొదటిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ఎంఎస్ ధోని ఆధ్వర్యంలోని భారత జట్టు గెలిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ని చిత్తుగా ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఇక 2011లో ధోని కెప్టెన్సీలోనే శ్రీలంకను ఓడించి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. ఈ రెండు సందర్భాల్లోనూ ధోనీ సారథ్యంలోని భారత జట్టులో గౌతమ్ గంభీర్ సభ్యుడిగా ఉన్నారు. ఇక ధోని 2013లో కెప్టెన్ హోదాలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కూడా దక్కించుకున్నాడు. 2024లో టీమిండియా హెడ్ కోచ్ గా వచ్చిన తర్వాత గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026 ట్రోఫీని ఇండియా సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓవరాల్ గా మూడోసారి, వరుసగా రెండోసారి, సొంతగడ్డపై తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
