గుజరాత్ వచ్చేసిన శివాలిక్ గ్యాస్ నౌక: తీరనున్న LPG కష్టాలు..!

గుజరాత్ వచ్చేసిన శివాలిక్ గ్యాస్ నౌక: తీరనున్న LPG కష్టాలు..!

గాంధీనగర్: మిస్సైళ్లు, బాంబుల దాడులతో రణరంగాన్ని తలపిస్తోన్న హార్మూజ్ జల సంధిని ధాటుకుని భారత శివాలిక్ గ్యాస్ నౌక ఇండియా చేరుకుంది. సోమవారం (మార్చి 16) సాయంత్రం గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవుకు రీచ్ అయ్యింది. ఈ నౌక గల్ఫ్ నుంచి 48 వేల మెట్రిక్‌ టన్నుల గ్యాస్‌ లోడ్ తీసుకొచ్చింది. గుజరాత్ చేరిన శివాలిక్ నౌక ద్వారా వచ్చిన గ్యాస్‎తో.. 32 లక్షల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను నింపొచ్చు. మన వంటింట్లో వాడే 14 కేజీలతో.. 32 లక్షల గ్యాస్ సిలిండర్ల కొరతను ఈ నౌక తీర్చనుంది. దీంతో ఇండియాలో ఎల్పీజీ కష్టాలు కొంత మేర తీరనున్నాయి. 

హార్మూజ్ జల సంధిని ఇరాన్ దిగ్భంధనం చేసినప్పటికీ భారత నౌకలు విజయవంతంగా ఇండియాకు రావడం గమనార్హం. శివాలిక్ నౌక హార్మూజ్ జల సంధి నుంచి ఎలాంటి అటంకం లేకండా భారత జలాలకు చేరుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. భారత ప్రభుత్వ సమర్ధవంతమైన దౌత్యం వల్లే ఇది సాధ్యమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం గ్యాస్ కొరత వేళ భారీ స్థాయిలో గ్యాస్ రావడం ప్రజలకు కాస్త ఊరట కలిగించే అంశం. 

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో హార్మూజ్ జల సంధిలో చమురు నౌకలు ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి. ఓడలు ముందు కదిలే పరిస్థితి లేదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా హార్మూజ్ జల సంధిని దిగ్భంధనం చేసింది ఇరాన్. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. 

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత ప్రభుత్వం రంగంలోకి సమర్థవంతమైన దౌత్యాన్ని ప్రదర్శించింది. ఇరాన్ గుండా భారత నౌకలు ప్రయాణించేందుకు లైన్ క్లియర్ చేసింది. ఇందులో భాగంగానే భారత జెండాతో ఉన్న ఎల్పీజీ  క్యారియర్ శివాలిక్ హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది.

పెర్షియన్ గల్ఫ్ నుంచి 48 వేల మెట్రిక్‌ టన్నుల ఎల్పీజీ లోడ్‎తో బయలుదేరిన శివాలిక్ నౌక సోమవారం (మార్చి 16) సాయంత్రం ఇండియాకు రీచ్ అయ్యింది. నౌక్ భారత పోర్టుకు చేరుకోగానే ఎలాంటి ఆలస్యం లేకుండా సరుకు అన్ లోడ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ప్రస్తుతం హార్మూజ్ జల సంధిలో భారత్‎కు చెందిన 22 చమురు నౌకలు ఉన్నాయని.. అవన్నీ సురక్షితంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే.. దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని.. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించింది. అన్ని రాష్ట్రాల్లో ఎల్పీజీ స్టాక్‌ ఉందని తెలిపింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సరఫరా చేస్తామని చెప్పింది.