మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి దగ్గర కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగింపు

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి దగ్గర కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగింపు

హైదరాబాద్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‎గా మారింది. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన త్వరలోనే పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జగిత్యాలోని జీవన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను ఆయన అనుచరులు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. 

సోమవారం (మార్చి 16) జీవన్ రెడ్డి ఇంటి పరిసరాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను ఆయన అనుచరులు తొలగించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపు సందర్భంగా ఈ వివాదం మరింత ముదిరింది.

 తన అనుచరులకు మున్సిపల్ చైర్ పర్సన్ పదవి దక్కకపోవడంతో తాను పార్టీలో ఉండే పరిస్థితులు లేవని కొద్ది రోజుల క్రితం జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో సోమవారం (మార్చి 16) జీవన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను స్వయంగా ఆయన అనుచరులే తొలగించడంతో పార్టీ మార్పు ప్రచారం స్థానికంగా ఊపందుకుంది.