IPL 10 జట్ల కెప్టెన్లు వీరే.. ఏ టీమ్కి ఎవరో తెలుసుకుందామా..!

IPL 10 జట్ల కెప్టెన్లు వీరే.. ఏ టీమ్కి ఎవరో తెలుసుకుందామా..!

IPL Captains In 10 Teams: మార్చి 28వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభం కానుంది. దీంతో ఐపీఎల్ లో ఎన్నో సంవత్సరాలుగా మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ లాంటి వారు ఆయా జట్లను ముందుండి నడిపించారు. దీంతో చెన్నై, ముంబై వంటి టీమ్స్ చెరో ఐదు సార్లు ట్రోఫీని కైవసం చేసుకున్నాయి. కానీ ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్ సమీపిస్తుంది. దీంతో ఆయా జట్లు నాయకత్వంలో కొన్ని మార్పులు చేశాయి. కొన్ని జట్లు కొత్త కెప్టెన్లతో టోర్నీలోకి వస్తుండగా, మరి కొన్ని టీమ్స్ నయా ప్లేయర్స్ కి ఈసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

ఐపీఎల్ 2026లోని 10 జట్ల కెప్టెన్లు: 

చెన్నై సూపర్ కింగ్స్– రుతురాజ్ గైక్వాడ్: 

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ మరోసారి నాయకత్వం వహించనున్నాడు. ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఈ జట్టు గత సీజన్‌లో ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేకపోయింది. దీంతో లీగ్  మధ్యలో గాయంతో గైక్వాడ్ కూడా జట్టుకు దూరమయ్యాడు. అయితే మహేంద్ర సింగ్ ధోనీ జట్టు పగ్గాలు అందుకున్నప్పటికీ ఫలితం మారలేదు. ఈసారి గైక్వాడ్ బ్యాటింగ్‌తో పాటు నాయకత్వంలో కూడా తన ప్రతిభను చూపించాల్సి ఉంటుంది.

డిల్లీ క్యాపిటల్స్ – అక్షర్ పటేల్: 

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అక్షర్ పటేల్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా మొదటిసారి బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. జట్టులో అనుభవజ్ఞులు ఉన్నప్పటికీ ఫ్రాంచైజీ అతనిపై నమ్మకం ఉంచింది. గత కొన్నేళ్లుగా జట్టుకు అత్యంత స్థిరమైన ఆటగాడిగా నిలిచిన అక్షర్ ఇప్పుడు కెప్టెన్సీ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడో అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

గుజరాత్ టైటాన్స్–శుభ్‌మన్ గిల్: 

గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 2022లో టైటిల్ గెలిచిన ఈ జట్టుకు 2024లో గిల్ నాయకత్వం చేపట్టాడు. గత రెండు సీజన్లు మంచి ప్రదర్శన చేసినప్పటికీ పూర్తిస్థాయి విజయాన్ని సాధించలేకపోయింది. ఈసారి జట్టు మరింత మెరుగైన ఫలితాలను ఆశిస్తోంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ – అజింక్య రహానే: 

మూడుసార్లు ఐపీఎల్ విజేతలైనా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు అజింక్య రహానే నాయకత్వం వహించనున్నాడు. అనుభవజ్ఞుడైన రహానే ఒత్తిడిని తట్టుకుని జట్టుని ముందుకు నడిపిస్తాడనే నమ్మకం ఫ్రాంచైజీకి ఉంది. సమతుల్యమైన జట్టుతో ఈసారి మరో టైటిల్ గెలవడమే వారి లక్ష్యంగా పెట్టుకున్నారు.

లక్నో సూపర్ జెయింట్స్ – రిషభ్ పంత్: 

లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు రిషభ్ పంత్ మరోసారి కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. గత సీజన్‌లో అతను బ్యాటింగ్ లో పెద్దగా రాణించలేదు.. కెప్టెన్సీలో కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.. అయినప్పటికీ అతని దూకుడు, ధైర్యం జట్టుకు పెద్ద బలంగా చెప్పాలి.

ముంబై ఇండియన్స్ – హార్దిక్ పాండ్యా: 

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులో అనేక మంది ఆటగాళ్లు మ్యాచ్ విన్నర్లు ఉండటంతో ముంబై ఎప్పుడూ బలమైన ప్రత్యర్థిగానే కొనసాగుతుంది. అన్నీ సరిగ్గా కలిసొస్తే ఈసారి టైటిల్ రేసులో ముందుండే అవకాశం ఉంది.

పంజాబ్ కింగ్స్ – శ్రేయస్ అయ్యర్: 

పంజాబ్ కింగ్స్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా రెండో సీజన్ లో కూడా కొనసాగుతున్నాడు. గత సీజన్‌లో పంజాబ్ ని ఫైనల్ వరకు చేర్చిన తర్వాత కేవలం 6 పరుగుల తేడాతో టైటిల్ కోల్పోయింది. ఆ ప్రయాణంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఈసారి జట్టును మరోసారి టైటిల్‌కు చేరవేయాలనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నాడు.  

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రాజత్ పాటిదార్: 

డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రాజత్ పాటిదార్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతని నాయకత్వంలో ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. 18 సంవత్సరాల నిరీక్షణకు తెరదించిన ఆ విజయాన్ని ఈసారి కూడా కొనసాగించాలనే లక్ష్యంతో జట్టు ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ – ప్యాట్ కమిన్స్: 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ మరోసారి నాయకత్వం వహించనున్నాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువగా ఆడకపోవడంతో అతను తాజాగా ఈ టోర్నమెంట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో బలమైన జట్టుగా హైదరాబాద్ కనిపిస్తోంది.

రాజస్థాన్ రాయల్స్ – రియాన్ పరాగ్: 

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు యువ ఆటగాడు రియాన్ పరాగ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఇంతకు ముందు కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే నాయకత్వం వహించిన అతను ఇప్పుడు పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టాడు. సంజూ సాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి మారడంతో పరాగ్ కెరీర్‌లో ఇది కీలకమైన అవకాశంగా మారింది.

దీంతో ఐపీఎల్ 2026లో అనుభవజ్ఞులతో పాటు యువ కెప్టెన్ల మిశ్రమంతో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ప్రతి జట్టు తమ కెప్టెన్ నాయకత్వంలో టైటిల్ కోసం పోరాడేందుకు రెడీ అవుతుంది.