TATA WPL 2026: ప్లే ఆఫ్స్ ఆడకుండా RCB ఫైనల్‌కు.. WPL రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

TATA WPL 2026: ప్లే ఆఫ్స్  ఆడకుండా RCB ఫైనల్‌కు.. WPL రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు (ఆర్సీబీ) డబ్ల్యూపీఎల్‌‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆడిన 8 మ్యాచ్ ల్లో 6 మ్యాచ్ లు గెలిచి టేబుల్ టాపర్ గా నిలిచింది. టేబుల్ టాపర్ గా నిలిచిన ఆర్సీబీ నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం (జనవరి 29) జరిగిన ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌‌పై గెలిచి తుది సమరానికి అర్హత సాధించింది. మిగిలిన మ్యాచ్ లతో సంబంధం లేకుండా ఈ సీజన్ లో అగ్రస్థానంలో నిలిచింది. ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆడకుండా ఫైనల్ కు చేరుకోవడం వెనుక కారణం ఉంది. అసలు WPL రూల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

డబ్ల్యూపీఎల్‌‌ మొత్తం ఐదు జట్లు ఆడుతున్నాయి.  ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ మహిళా ప్రీమియర్ లీగ్ ఆడుతున్నాయి. 2023లో ప్రారంభమైన మహిళా ఐపీఎల్..ప్రస్తుతం నాలుగో సీజన్ ముగింపు దశకు వచ్చింది. నాలుగు సీజన్ ల పాటు ఐదు జట్లు ఆడాయి. ఈ లీగ్ రూల్స్ ప్రకారం రౌండ్ రాబిన్ తరహాలో ఒక్కో జట్టు మిగిలిన జట్టుతో రెండు మ్యాచ్ లు ఆడుతుంది. టేబుల్ టాపర్ గా నిలిచిన జట్టు ఫైనల్లో అడుగు పెడుతుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్లు గ్రూప్ దశలో నిష్క్రమిస్తాయి. రూల్స్ ప్రకారం ఈ సీజన్ లో టేబుల్ టాపర్ గా నిలిచిన రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు జట్టు ఫైనల్ కు అర్హత సాధించింది.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆల్‌‌రౌండ్‌‌ షోతో ఆకట్టుకున్న రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు (ఆర్సీబీ) డబ్ల్యూపీఎల్‌‌  ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఛేజింగ్‌‌లో గ్రేస్‌‌ హారిస్‌‌ (37 బాల్స్‌‌లో 13 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 75), స్మృతి మంధాన (27 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 54 నాటౌట్‌‌) దంచికొట్టడంతో గురువారం జరిగిన ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌‌పై గెలిచింది. టాస్‌‌ ఓడిన యూపీ 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. దీప్తి శర్మ (55), మెగ్‌‌ లానింగ్‌‌ (41) రాణించారు. తర్వాత బెంగళూరు 13.1 ఓవర్లలోనే 147/2 స్కోరు చేసి నెగ్గింది. ఈ ఓటమితో యూపీ ప్లే ఆఫ్ రేస్‌‌ నుంచి నిష్క్రమించింది. హారిస్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.