హైదరాబాద్లో రేయింబవళ్లు బంగారం రద్దీ.. హోల్సేల్ బంగారు కాయిన్లు, బిస్కెట్ల కోసం జనం బారులు

హైదరాబాద్లో రేయింబవళ్లు బంగారం రద్దీ.. హోల్సేల్ బంగారు కాయిన్లు, బిస్కెట్ల కోసం జనం బారులు

బషీర్​బాగ్, వెలుగు: 24 క్యారెట్ల తులం బంగారం ధర త్వరలో రూ.2 లక్షల మార్క్​ను దాటే అవకాశం ఉందని వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్న నేపథ్యంలో బంగారం కొనుగోలుపై ప్రజల్లో ఆసక్తి భారీగా పెరిగింది. బేగంబజార్​లో 60 ఏండ్ల చరిత్ర ఉన్న శ్రీ కృష్ణ జ్యూవెల్లర్ మార్ట్ వద్ద హోల్​సేల్ బంగారు కాయిన్లు, బిస్కెట్ల కోసం జనం బారులు తీరారు.

ఉదయం నుంచి రాత్రి వరకూ క్యూ లైన్లలో నిలబడి టోకెన్లు తీసుకుని మరీ బంగారం కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్​తో పాటు ఇతర జిల్లా నుంచి కూడా ప్రజలు ఇక్కడికి తరలివస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్, భౌగోళిక ఉద్రిక్తతలు ధరల పెరుగుదలకు కారణం. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై 100 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించడం పెట్టుబడిదారులలో ఆందోళన పెంచింది.

దక్షిణ కొరియా వాహనాలపై, మందులపై యూఎస్ 25 శాతం పన్నులు పెంచడంతో బంగారం, వెండికి గిరాకీ పెరిగింది. ఆసియా, యూరప్​ దేశాలు భారీగా కొనుగోలు చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ విధానాల్లోని అస్పష్టత ఈ ఏడాది ధరలను శాసిస్తోందని ఆగ్‌‌‌‌మాంట్ ప్రతినిధి రెనిషా చైనానీ పేర్కొన్నారు.