పూల వనంలో గంజాయి సాగు.. పూజారి ముసుగులో మత్తు దందా..గుడికి వచ్చే భక్తులను నాలుగు మంచి మాటలు చెప్పి మంచిమార్గంలో పెట్టాల్సిపోయి..మత్తు పదార్థాలతో కిక్కెక్కిస్తున్నాడు ఓ సాధువు. చుట్టూ నాలుగు ఊర్ల ప్రజలను నమ్మించి అక్రమంగా ఈ మత్తు దందా చేస్తున్న గురు మహారాజ్ కటకటాలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే..
సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం పంచాగామ్ లో అక్రమంగా గంజాయి సాగు చేస్తూ మత్తు పదార్థాల దందా చేస్తున్న గుడి పూజారిని డీటీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
గత కొద్దికాలంగా పంచాగామ్ లో గంజాయి సాగు అవుతోందని సమాచారం అందుకున్న ఎక్సైజ్ సిబ్బంది గ్రామంలో తనిఖీలు చేపట్టారు. గుడి పూజారిగా పనిచేస్తున్న అవుంటి నర్సయ్య అనే సాధువు, దేవుడికోసం సాగుచేస్తున్న పూలవనంలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించారు.
అవుంటి నర్సయ్య పూలవనంలో సాగు చేసిన 17.741కేజీల 685 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.70లక్షల ఉంటుందని అంచనా వేశారు.చాల కాలంగా గంజాయి సాగు చేస్తూ ప్యాకెట్లుగా తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.
పంచాగామ్ తోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు సాధువుగా మంచి గుర్తింపు ఉన్న ఈ పూజారి, గంజాయి దందా చేస్తున్నాడనితెలియడంతో అంతా షాక్ అయ్యారు. గుడిలోపూజారిగా ఉండి ఇవేం పనులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
