నాన్న రెండో పెళ్లి చేసుకుంటే.. మొదటి భార్య కుమార్తెకు భరణం ఇవ్వాలి..!

నాన్న రెండో పెళ్లి చేసుకుంటే.. మొదటి భార్య కుమార్తెకు భరణం ఇవ్వాలి..!

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇటీవల ఒక కీలక తీర్పును వెలువరిస్తూ.. తండ్రి బాధ్యతలపై స్పష్టతనిచ్చింది. కుమార్తె వయస్సుతో సంబంధం లేకుండా.. ఆమెకు వివాహం అయ్యే వరకు పోషణ, పెళ్లి ఖర్చులు చెల్లించాల్సిన బాధ్యత తండ్రిపై ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ.. మొదటి భార్య సంతానమైన కుమార్తె విషయంలో అతను తన బాధ్యతల నుంచి తప్పించుకోవటం కుదరదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 25 ఏళ్ల యువతి తన తండ్రిపై న్యాయపోరాటానికి వెళ్లింది. ఆమె తండ్రి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నెల జీతం రూ.44,642. ఆయన రెండో పెళ్లి చేసుకుని.. మరో ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో తనను తండ్రి పట్టించుకోవడం లేదని.. తనకు పెళ్లి ఖర్చుల కోసం రూ.15 లక్షలు, అలాగే నెలవారీ మెయింటెనెన్స్ కావాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. అయితే కుమార్తెకు మేజర్ వయస్సు వచ్చిందని, తాను రెండో కుటుంబం బాధ్యతలతో ఉన్నానని తండ్రి వారించాడు.

ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టుహిందూ దత్తత మరియు భరణం చట్టం, 1956లోని సెక్షన్ 20(3), సెక్షన్ 3(బి)లను ప్రస్తావించింది. సెక్షన్ 20(3) ప్రకారం ఒక హిందూ తండ్రి తన పెళ్లికాని కూతురు తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, ఆమెకు మేజర్ వయస్సు వచ్చినప్పటికీ పోషించాల్సిన చట్టబద్ధమైన బాధ్యతను కలిగి ఉంటాడని పేర్కొంది. అలాగే సెక్షన్ 3(బి) ప్రకారం మెయింటెనెన్స్ అంటే కేవలం ఆహారం, బట్టలు, ఉండటానికి ఇల్లు మాత్రమే కాదు; పెళ్లికాని కుమార్తె విషయంలో ఆమె పెళ్లి ఖర్చులు కూడా ఇందులో భాగమేనని చట్టం స్పష్టంగా చెబుతోంది.

ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన పూనమ్ సేథి వర్సెస్ సంజయ్ సేథి కేసును ఉటంకిస్తూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు.. కన్యాదానం అనేది ఒక హిందూ తండ్రికి పవిత్రమైన బాధ్యత. దాని నుంచి ఆయన తప్పించుకోవటం కుదరదని కోర్టు వ్యాఖ్యానించింది. తండ్రి ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో సదరు కుమార్తెకు పెళ్లి అయ్యే వరకు లేదా ఆమె సొంతంగా సంపాదించుకునే వరకు నెలకు రూ.2,500 చెల్లించాలని కోర్టు వెల్లడించింది. అలాగే ఆమెకు పెళ్లి ఖర్చుల కోసం తండ్రి రూ.5 లక్షల సొమ్మును 3 నెలల్లో డిపాజిట్ చేయాలని తీర్పు వెలువరించింది. 

ఈ తీర్పు సమాజంలో కుమార్తెల హక్కులను మరోసారి బలపరిచింది. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నా.. పిల్లలు మేజర్లు అయినా.. తండ్రికూతురు బంధం వల్ల వచ్చే చట్టబద్ధమైన, నైతిక బాధ్యతలు రెండో పెళ్లితో ముగిసిపోవని గుర్తు చేసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, జీతం పొందుతున్న తండ్రి తన కుమార్తెకు అండగా ఉండటం చట్టపరమైన బాధ్యత అని హైకోర్టు స్పష్టం చేసింది.