NSE, BSEకి పోటీగా మరో స్టాక్ ఎక్స్ఛేంజీ.. బడ్జెట్ రోజున ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లకు అందుబాటులోకి..

NSE, BSEకి పోటీగా మరో స్టాక్ ఎక్స్ఛేంజీ.. బడ్జెట్ రోజున ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లకు అందుబాటులోకి..

భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే నేటి కాలం ఇన్వెస్టర్లకు తెలిసిందల్లా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ మాత్రమే. చాలా మంది ఈ రెండింటిలోనే స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడులు పెడుతుంటారు. కానీ ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు మరో ఎక్స్ఛేంజీ కూడా అందుబాటులోకి వచ్చేస్తోంది. అయితే ఇది కొత్తదేమీ కానప్పటికీ చాలా మంది పాతతరం ఇన్వెస్టర్లకు పరిచయం ఉన్న పేరే మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్ఛేంజీ. చాలా కాలం తర్వాత కొత్త జోష్ తో ఇది దేశీయ ఇన్వెస్టర్ల ముందుకు తిరిగి రాబోతోందనే వార్త ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. 

భారత స్టాక్ మార్కెట్ రంగంలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్ఛేంజ్(MSE) మళ్లీ కొత్త రూపుతో దూసుకొస్తోంది. ఫిన్‌టెక్ ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన దాదాపు 12 వందల కోట్ల రూపాయల పెట్టుబడితో, సరికొత్త టెక్నాలజీని జోడించుకుని ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల ఆధిపత్యానికి సవాలు విసిరేందుకు సిద్ధమైంది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది జనవరి 27న ట్రేడింగ్‌ను పునఃప్రారంభించిన ఈ ఎక్స్ఛేంజ్, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సందర్భంగా ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను కూడా నిర్వహించనుంది.

గతంలో ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్(MCX-SX) పేరుతో ఉన్న ఈ ఎక్స్ఛేంజ్.. 2015లో ఎంఎస్‌ఈగా పేరు మార్చుకుంది. సిస్టమ్ లోపాలను సరిదిద్దడం, పారదర్శకతను పెంచడం, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని గెలవడమే లక్ష్యంగా ఇప్పుడు రీలాంచ్ అయింది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుండటం, డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపడటం వంటి అంశాలు ఎంఎస్‌ఈ పునరాగమనానికి సానుకూలాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్ఎంఈలు, స్టార్టప్‌లు దీనిలోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అయితే MSEలో పెట్టుబడులు పెట్టాలనుకునే రిటైల్ ఇన్వెస్టర్లు కొన్ని సవాళ్లను గమనించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా లిక్విడిటీ సమస్య ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలతో పోలిస్తే ఇక్కడ ట్రేడింగ్ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల.. షేర్లను కొనేటప్పుడు లేదా అమ్మేటప్పుడు ఇబ్బందులు ఎదురుకావచ్చు. అలాగే తక్కువ కంపెనీలు లిస్ట్ అయి ఉండటం వల్ల కూడా సమస్యలు ఉంటాయని గుర్తు చేస్తున్నారు..

MSE అనేది రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్న ఇన్వెస్టర్లకు మాత్రమే అనుకూలమని నిపుణులు అంటున్నారు. మార్కెట్ లీడర్‌గా ఉన్న ఎన్‌ఎస్‌ఈని తట్టుకుని నిలబడటం ఎంఎస్‌ఈకి అంత ఈజీ కాదని, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పొందడానికి చాలా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం చూసే సాధారణ ఇన్వెస్టర్లు ఇప్పటికీ స్థిరంగా ఉన్న ఎక్స్ఛేంజీల వైపే మొగ్గు చూపడం క్షేమదాయకమని వారి సూచన. అయితే పెరగనున్న పోటీతో మెరుగైన సేవలు ఇన్వెస్టర్లకు దొరకొచ్చని చెప్పొచ్చు.