గతంలో 'టూరిస్ట్ ఫ్యామిలీ' వంటి విభిన్నమైన చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అభిషన్ జీవింత్... ఇప్పుడు వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ 'విత్ లవ్'. ఈ సినిమాలో 'ఛాంపియన్' ఫేమ్, కేరళ కుట్టి అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తుంది. మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సౌందర్య రజినీకాంత్, మాగేశ్ రాజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఆకట్టుకుంటున్న ట్రైలర్
లేటెస్ట్ గా 'విత్ లవ్' చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ యూత్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. కాలేజీ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథగా దీనిని మలిచినట్లు స్పష్టమవుతోంది. "ప్రేమ అనేది ఒక అనుభూతి మాత్రమే కాదు, అదొక ప్రయాణం" అనే పాయింట్‌ను దర్శకుడు చాలా హృద్యంగా చూపించారు. అభిషన్ జీవింత్ నటనలో ఎంతో పరిణితి కనిపిస్తుండగా, అనస్వర రాజన్ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు మనసు గెలుచుకుంటోంది.
ఫిబ్రవరి 6న రిలీజ్..
ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, అన్ని కార్యక్రమాలను ముగించుకుని ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. సౌందర్య రజినీకాంత్ నిర్మాణ భాగస్వామి కావడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సంగీతం, విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కాలేజీ రోజుల్లోని తీపి జ్ఞాపకాలను, మొదటి ప్రేమలోని మధురానుభూతులను మళ్ళీ వెండితెరపై గుర్తు చేయబోతున్న 'విత్ లవ్'.. ప్రేమికుల రోజు (Valentines Day) కి ముందే థియేటర్లలో సందడి చేయనుంది.
