కొత్త నటులు అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దేవగుడి’ (Devagudi). యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాణ బాధ్యతలను కూడా నిర్వర్తించారు. మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె కీలక పాత్రలో కనిపించగా, ఫోక్ సాంగ్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన మదీన్ ఎస్.కె సంగీతం అందించారు.
ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తించిన ‘దేవగుడి’ సినిమా, శుక్రవారం (2026 జనవరి 30) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? లోతుగా పాతుకుపోయిన కుల వ్యవస్థను డైరెక్టర్ ఎలాంటి కోణంలో చూపించాడో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే:
రాయలసీమలోని ‘దేవగుడి’ అనే ఒక గ్రామం. ఆ ఊరిలో వీరారెడ్డి (రఘు కుంచె) అనే ఒక ఫ్యాక్షన్ లీడర్. అతనికి నాయకత్వం మీద ఎంత పట్టు ఉంటుందో.. కులపిచ్చి కూడా అంతేస్థాయిలో ఉంటుంది. తన ప్రాణాలను కాపాడే అనుచరులని కూడా కుల పిచ్చితోనే చూడటం అతని స్వభావం.
అలాంటి వీరారెడ్డి, తన అనుచరులలో ఒకరి కొడుకు ధర్మ (అభినవ్ శౌర్య). అతను వీరారెడ్డి కుమారుడితో (నరసింహ)తో ఫ్రెండ్ షిప్ చేస్తాడు. అదే సమయంలో వీరారెడ్డి కూతురు శ్వేత (అనుశ్రీ)ని లవ్ చేస్తాడు. ఇదంతా పసిగట్టిన వీరారెడ్డి, ఒక కారణం సృష్టించి ధర్మను ఊరి నుంచి గెంటేస్తాడు.
ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు వీరారెడ్డి జీవితాన్ని పూర్తిగా మలుపుతిప్పుతాయి. ఒకవైపు వరుసగా అతని అనుచరులు హత్యకు గురవుతుంటే, మరోవైపు శ్వేత అకస్మాత్తుగా మాయమవుతుంది. అసలు శ్వేత ఎలా మిస్సైంది? ధర్మ-వీరారెడ్డి మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి? చివరికి శ్వేత – ధర్మల ప్రేమకథకు ఎలాంటి ముగింపు దక్కింది? అన్నదే మిగతా కథ.
ఎలా ఉందంటే:
తెలుగు ఆడియన్స్కి “కుల వ్యవస్థ”పై తెరకెక్కే సినిమాలంటే ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఇలాంటి కథాంశాలతో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ఆదరిస్తూ విజయవంతం చేస్తున్నారు. మొన్నటికి మొన్న వచ్చిన దండోరా సినిమా కూడా ఇదే అంశంతో వచ్చి సూపర్ సక్సెస్ సాధించింది.
నిజానికి, టెక్నాలజీ ఎంత మారినా, కుల పిచ్చి మాత్రం ఇప్పటికీ పూర్తిగా మారలేదన్నది కఠినమైన నిజం. ఈనాటికీ, సమాజంలో ఎక్కడో ఒకచోట అమాయకులు వివక్షకు గురవుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మన తెలుగు దర్శక-రచయితలు తమ కలాన్ని పదును పెట్టి, కుల వ్యవస్థ నిర్మూలనకు తమ స్వరం వినిపిస్తున్నారు. తమ సినిమాతో ఒక్కరిలో అయినా మార్పుతీసుకురావాలనే ఆశతో కొత్త కథలతో వస్తునే ఉన్నారు. సమాజానికి తమ భావాలను చాటి చెప్పాలనే సంకల్పంతో నిజజీవిత కథలను తవ్వి తీస్తూనే ఉన్నారు. అయితే, ఒక్కో కథ వెనుక ఉన్న పాయింట్ వేరే అయినప్పటికీ, దానికి అడ్డొచ్చే మొదటి శత్రువు " కులమే". అదే కోవలో వచ్చిన చిత్రమే ఈ ‘దేవగుడి’.
ALSO READ : తిరువీర్ ఉగ్ర అవతారం.. ‘భగవంతుడు’ టీజర్‌తో అంచనాలు పీక్స్!
అయితే, కుల వ్యవస్థపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ, ‘దేవగుడి’ తనదైన కథనం, ట్రీట్మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో సినిమా చాలావరకు సక్సెస్ అయ్యిందని చెప్పాలి. సమాజంలో ప్రధాన సమస్యలలో ఒకటైన కుల వ్యవస్థను ప్రశ్నిస్తూ కథ మొదలవుతుంది.
అన్నాచెల్లెళ్లతో బలమైన బాండింగ్ పెంచుకునే హీరోకి, వీరారెడ్డికి మధ్య జరిగే సీన్స్ ఆకట్టుకునేలా తెరకెక్కించాడు డైరెక్టర్. ఈ క్రమంలో కులపిచ్చితో ఉన్న నిండిన వీరారెడ్డి ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు కథలో కీలక మలుపులకు దారి తీస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుంది. ఓవరాల్ గా డ్రామా, ఎమోషన్, కుల వ్యవస్థ మధ్యన ఉన్న సంఘర్షణే ఈ ‘దేవగుడి’.
నటీనటుల నటన:
హీరోగా అభినవ్ శౌర్య, హీరోయిన్ అనుశ్రీ కొత్త వాళ్లే. అయినప్పటికీ తమ నటనతో మెప్పించారు. హీరోయిన్ సోదరుడి పాత్రలో నటించిన నరసింహ సైతం ఆకట్టుకున్నారు. సింగర్ రఘు కుంచె మరోసారి తన అగ్రెసివ్ పాత్రతో ఇంపాక్ట్ కలిగించారు. దేవగుడి వీరారెడ్డి అనే పాత్రలో తనదైన నటనను కనబరిచారు. అలాగే, కీలక పాత్రలో నటించిన మీసాల లక్ష్మణ్, రఘుబాబు తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నీకల్ అంశాలు:
మదీన్ SK సంగీతం చాలా బాగుంది. పాటలు తెరపై వింటుంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా టోన్‌ను మరింతగా పెంచుతుంది. దర్శక-నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి స్నేహం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలకు కుల వ్యవస్థను జోడించి కథను ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు.
