బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ భామ నటించిన 'మర్దానీ 3' మూవీ జనవరి 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు అవుతుంది. ముఖ్యంగా 'మర్దానీ' సిరీస్‌లో శివాని శివాజీ రాయ్‌గా ఆమె చూపిన తెగింపు మహిళల్లో స్ఫూర్తిని నింపారు. కానీ, రియల్ లైఫ్‌లో ఆమె ఇచ్చిన ఒక స్టేట్‌మెంట్ ఇప్పుడు విమర్శల పాలవుతోంది. సోషల్ మీడియాలో పెద్ద దుమారమే నడుస్తోంది.
ఏం జరిగింది?
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కుటుంబ విలువల గురించి రాణి ముఖర్జీ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.. "గౌరవం అనేది ఇంటి నుంచే మొదలవుతుంది. ఇంట్లో తండ్రి తన భార్యను ఎలా చూస్తున్నాడో గమనించే అబ్బాయిలు పెరుగుతారు. ఒకవేళ తండ్రి తల్లిని తక్కువ చేసి మాట్లాడితే, అబ్బాయిలు కూడా సమాజంలో మహిళలను అలాగే చూడవచ్చని భ్రమపడతారు అని ఆమె సరిగ్గానే విశ్లేషించారు. అయితే, ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలే అసలు రచ్చకు కారణమయ్యాయి.
వివాదానికి దారితీసిన ఆ మాటలు..
తండ్రి తల్లిపై గొంతు పెంచడం తప్పు. నిజానికి, తల్లే తండ్రిపై గొంతు పెంచాలి. అప్పుడే పరిస్థితి సరిగ్గా ఉంటుంది అని రాణి ముఖర్జీ వ్యాఖ్యానించారు. దీనికి తోడు, తన పాఠశాల రోజుల్లో ఒక అబ్బాయిని చెంపదెబ్బ కొట్టిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. "మా ఇంట్లో నా భర్త పరిస్థితి ఏంటో ఆయననే అడగండి" అంటూ సరదాగా నవ్వేశారు. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి
వెల్లువెత్తుతున్న విమర్శలు
రాణి ముఖర్జీ ఈ మాటలను సరదాగా అన్నప్పటికీ.. నెటిజన్లు మాత్రం దీనిని సీరియస్‌గా తీసుకుంటున్నారు. "లింగ సమానత్వం అంటే ఒకరిపై ఒకరు గొంతు పెంచడం కాదు, ఇద్దరూ గౌరవించుకోవడం" అని కొందరు హితవు పలుకుతున్నారు. "మీరు సీనియర్ నటి అయినంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడటం సరికాదు" అని మరికొందరు మండిపడుతున్నారు. "మగాళ్లు గొంతు పెంచడం తప్పయితే, ఆడవాళ్లు గొంతు పెంచడం మాత్రం ఎలా సరైనది అవుతుంది?" అంటూ సోషల్ మీడియాలో రచ్చే మొదలు పెట్టారు నెటిజన్లు.
బాక్సాఫీస్ వద్ద 'మర్దానీ 3'
ప్రస్తుతం రాణి ముఖర్జీ తన ప్రతిష్టాత్మక చిత్రం 'మర్దానీ 3' . ఈ చిత్రం జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మొదటి రెండు భాగాలు ఘనవిజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నది ఆసక్తికరంగా మారింది. సమాజంలో మహిళలకు గౌరవం దక్కాలన్న రాణి ముఖర్జీ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, వ్యక్తీకరణలో తడబడటం ఆమెను ఇబ్బందుల్లో నెట్టింది. మరి ఈ విమర్శలపై ఆమె స్పందిస్తారో లేదో చూడాలి..
