బాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు 'కాహో నా ప్యార్ హై' అంటూ కుర్రకారు గుండెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నటి అమీషా పటేల్. ఆ తర్వాత సన్నీ డియోల్‌తో నటించిన 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' భారతీయ సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన 'బద్రి' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. పద్ధతైన అమ్మాయిగా, గ్లామరస్ హీరోయిన్‌గా మెప్పించిన ఈ బ్యూటీ ఇటీవల తన బోల్డ్ వ్యాఖ్యలతో మరో సారి వార్తల్లో నిలిచారు.
స్త్రీ పురుషులు సమానం కాదు..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. సమాజంలో స్త్రీ, పురుషుల పాత్రల గురించి ఆమె తన మనసులోని మాటను అమీషా పటేల్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు . స్త్రీ పురుషులు ప్రకృతి రీత్యా వేర్వేరు. కేవలం ప్యాంట్లు వేసుకున్నంత మాత్రాన స్త్రీలు పురుషులు అయిపోరని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ కొన్ని ప్రత్యేక విషయాలు ప్రకృతి సిద్ధంగా స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా కేటాయించబడ్డాయి. మనం ఆ గీతను దాటకూడదు, ఎందుకంటే మనం జీవశాస్త్రపరంగా (Biologically) అలాగే పుట్టాం అని ఆమె పేర్కొన్నారు . ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
అమ్మాయిలమనే విషయాన్ని మర్చిపోతూ..
నేటి కాలంలో స్త్రీలు సమాన హక్కుల కోసం పోరాడుతూ.. తాము అమ్మాయిలమనే విషయాన్ని మర్చిపోతున్నారు అని అమిషా పటేల్ అన్నారు. ఒక అబ్బాయి తన కోసం డోర్ తీయడం, కుర్చీ లాగడం వంటి మర్యాదలను కోరుకోవడంలో తప్పులేదు అని ఆమె చెప్పుకొచ్చారు. తల్లులు కూడా తమ పిల్లలకు ఈ విషయాలు నేర్పించడం మానేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల్లో ఉండే మృదుత్వం, సున్నితత్వం వారి అసలైన బలమని, వాటిని కోల్పోకూడదని ఆమె సూచించారు.
సెకండ్ ఇన్నింగ్స్‌లో మ్యాజిక్
చాలా కాలం గ్యాప్ తర్వాత 'గదర్ 2' సినిమాతో అమీషా మళ్ళీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నారు. 'సకినా' పాత్రలో ఆమె నటన ఇప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఆమె పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా.. తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు కొందరికి పాతకాలపు ఆలోచనల్లా అనిపించవచ్చు. కానీ అందులోని లోతైన అర్థం - నిజమైన సమానత్వం అంటే ఒకరి సహజత్వాన్ని మరొకరు గౌరవించుకోవడం అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
