సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న భారీ అడ్వెంచర్ మూవీ "వారణాసి". 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి చిత్రాలతో తెలుగు సినిమాను ప్రపంచ పటంలో నిలబెట్టారు జక్కన్న. ఇప్పుడు అంతకు రెట్టింపు అంచనాతో "వారణాసి" సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ విజువల్ వండర్ ను ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఉగాది కానుకగా.. బాక్సాఫీస్ వేట!
రాజమౌళి తన సినిమాల విడుదలను ఎప్పుడూ పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తుంటారు. అయితే ఈ సినిమా రిలీజ్ ను ఏప్రిల్7వ తేదీని ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు సమాచారం. ఆ సమయంలో ఉగాది, గుడి పడ్వా వంటి పండుగలతో పాటు వరుస సెలవులు ఉండటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయం అని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారణాసి నగరంలో ఏప్రిల్ 7, 2027 అని ఉన్న భారీ హోర్డింగ్‌లు దర్శనమివ్వడం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
టైమ్ ట్రావెల్ అడ్వెంచర్
గత ఏడాది హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన 'గ్లోబ్‌ట్రోటర్' (Globetrotter) ఈవెంట్‌లో ఈ సినిమా టైటిల్‌ను "వారణాసి" గా ప్రకటించారు. ఈ మూవీలో మహేష్ బాబు 'రుద్ర'గా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 'మందాకిని'గా చాలా కాలం తర్వాత ఇండియన్ స్క్రీన్ పైకి వస్తున్నారు. ఇక మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే శక్తివంతమైన విలన్ పాత్రలో అలరించనున్నారు.
ఈ సినిమా కేవలం ఒక అడ్వెంచర్ మాత్రమే కాదు, పురాణాలకు , సైన్స్ ఫిక్షన్‌కు మధ్య ఉన్న వారధి అని సమాచారం. ట్రెతా యుగం , అంటార్కిటికా మంచు కొండల నుంచి ఆఫ్రికా అడవుల వరకు సాగే ఒక సాహసోపేత ప్రయాణం ఇది. సినిమాలో రామాయణ యుద్ధానికి సంబంధించిన ఒక కీలక ఘట్టం ఉంటుందని, మహేష్ బాబును విలువిద్యలో ఆరితేరిన ఒక అడ్వెంచరర్‌గా రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దారని తెలుస్తోంది.
భారీ బడ్జెట్ తో..
సుమారు రూ1,000 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. హాలీవుడ్ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నేను చిన్నప్పటి నుండి రామాయణ, మహాభారతాలను ఎంతో ఇష్టపడతాను. ఈ సినిమాలో రామాయణానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని షూట్ చేస్తున్నప్పుడు గాలిలో తేలుతున్నట్లు అనిపించింది అని రాజమౌళి ఒక సందర్భంలో పేర్కొన్నారు. మహేష్ బాబును గతంలో ఎన్నడూ చూడని రీతిలో, ఒక గ్లోబల్ అడ్వెంచరర్‌గా చూడటానికి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న భారతీయ సినిమా సరిహద్దులు మరోసారి చెరిగిపోవడం ఖాయం అని ధిమా వ్యక్తం చేస్తున్నారు.
