పోలీసులపై నోరుపారేసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిగొచ్చారు. పోలీసులకు సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని..ప్రస్టేషన్లో నోరు జారానని చెప్పారు. పోలీసులంటే తనకు గౌరవం ఉందని.. తన మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించాలన్నారు. కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని..ఈ వివాదాన్ని ఇంతటి ముగింపు పలకాలని కోరారు కౌశిక్ రెడ్డి.
కరీంనగర్ సీపీ మతమార్పిడులకు పాల్పడుతున్నారని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్ అయ్యింది. ఎమ్మెల్యే ఆరోపణలు నిరాధారమైనవని..ఆయన వెంటనే సీపీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే పోలీసులకు క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.
అసలేం జరిగింది.?
గురువారం (జనవరి 29) కరీంనగర్ జిల్లా వీణ వంక లోకల్ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తుంటే పోలీస్లు తమను అడ్డుకున్నారని తన కుటుంబంతో కలిసి హుజరాబాద్లో రోడ్డుపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బైఠాయించారు. రోడ్డుపై బైఠాయించిన పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి పోలీసులపై రెచ్చిపోయారు. పోలీసుల మీదకు దూసుకెళ్లి బెదిరించారు.
‘భవిష్యత్తులో రేపు మీ కంటే పెద్ద పొజిషన్లో ఉంటా. మీ కంటే ఎక్కువ పవర్ నాకు ఉంటుంది. నా ఇంట్లో పండగ లేకుండా చేస్తున్నారు. నాపైన ఎన్ని కేసులైనా పెట్టుకోండి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కని సంగతి చూస్తా. వీణవంకలో సమ్మక్క పండగ చేసుకోకుండా అడ్డుకున్నారు’ అని సీఐకి వార్నింగ్ ఇచ్చారు.
