తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విచారణ చేసిన సీబీఐ.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. తన నివేదికను వెల్లడించింది. సుదీర్ఘ విచారణ తర్వాత.. తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో.. జంతువుల కొవ్వు లేదని.. జంతువుల నుంచి తీసిన కల్తీ నెయ్యిని ఉపయోగించలేదని వెల్లడించింది సీబీఐ. జగన్ ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో.. జంతువుల కొవ్వు ఉందని స్వయంగా సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటల తర్వాత.. కేసులు నమోదయ్యాయి. సీబీఐ విచారణకు జగన్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సీబీఐ విచారణ చేసింది. విచారణ తర్వాత.. జగన్ ప్రభుత్వం హయాంలో తిరుమలలో తయారు చేసిన లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని.. కల్తీ జరగలేదని.. స్పష్టం చేస్తూ సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది.
శుక్రవారం ( జనవరి 23 ) ఫైనల్ చార్జిషీట్ సమర్పించింది సీబీఐ సిట్. తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యిలో కూరగాయల నూనెలు, కృత్రిమ పాల ఉత్పత్తులలో వాడే ఈస్టర్‌లు కలిపి కల్తీ చేశారని చార్జిషీట్ లో పేర్కొంది సిట్. నెయ్యిలో జంతువుల కొవ్వు జాడ లేదని స్పష్టం చేసింది సిట్.
సిట్ సమర్పించిన ఫైనల్ చార్జిషీట్ పై స్పందించిన టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఉద్దేశపూర్వకంగా హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు.
జగన్ ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఏకైక ఉద్దేశంతోనే తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. నిరాధారమైన ఆరోపణలతో జగన్ ను కించపరచడమే కాకుండా.. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్రత, ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు.గత ఏడాదిన్నర కాలంగా.. ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్లకు పైగా హిందువులు ఈ తప్పుడు ప్రచారంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని అన్నారు.
ఉత్తరాఖండ్‌లోని భగవాన్‌పూర్‌లో ఉన్న ప్రధాన సరఫరాదారు భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ "వర్చువల్" తయారీ యూనిట్‌గా పనిచేస్తుందని ఛార్జిషీట్ లో వెల్లడించింది సిట్. 2019 నుండి 2024 వరకు భోలెబాబా డెయిరీ నెయ్యి తయారీ కోసం పాలు, వెన్నను తీసుకోలేదని, అయినప్పటికీ టీటీడీకి కనీసం 68వేల కిలోల నెయ్యిని సరఫరా చేసిందని పేర్కొంది సిట్.
ఫైనల్ ఛార్జిషీట్‌లో 36 మందిని నిందితులుగా పేర్కొంది సిట్, ఇందులో తొమ్మిది మంది టిటిడి అధికారులు, ఐదుగురు డైరీకి సంబంధించిన వ్యక్తులు, తదితరులు ఉన్నారు.
