ఏపీ,తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఢిల్లీలో భేటీ అయ్యింది. ఈ సమావేశానికి కమిటీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో పాటు కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్ హాజరయ్యారు.
ఏపీ తరపున సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఇంజనీరింగ్ చీఫ్ నరసింహమూర్తి , చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్, సూపర్డెంట్ ఇంజనీర్ గంగాధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రామచంద్రరావు, కె, రమేష్ హాజరయ్యారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి జనవరి 2 న ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. గోదావరి, కృష్ణాలో అందుబాటులో ఉన్న జలాలు నికర జలాలు, మిగులు జలాలు, ప్రాజెక్టులు సహా పల అంశాలపై వివాదాలను పరిష్కరించుకుని ఎలా ముందుకు వెళ్లాలని దానిపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.
గతేడాది కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలు వాటిని చర్చించి సాంకేతికంగా పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకే ఇవాళ భేటీ అయిన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు అయ్యింది.
