Temba Bavuma: బీసీసీఐకి బవుమా సలహా.. టీమిండియా హెడ్ కోచ్‌గా అతడినే ఉంచాలంటూ కామెంట్స్

Temba Bavuma: బీసీసీఐకి బవుమా సలహా.. టీమిండియా హెడ్ కోచ్‌గా అతడినే ఉంచాలంటూ కామెంట్స్

టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ అడుగుపెట్టినప్పటి దగ్గర నుంచి భారత జట్టు ఖాతాలో ఊహించని చెత్త రికార్డులు వచ్చి చేరుతున్నాయి. టీ20 ఫార్మాట్ మినహాయిస్తే మిగిలిన వన్డే, టెస్టుల్లో భారత జట్టు స్థాయికి తగ్గ ఆట తీరును ప్రదర్శించడంలో విఫలమవుతోంది. స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ జట్టు విజయాలు సాధించడంలో తడబడుతోంది. స్వదేశంలో తిరుగులేని టీమిండియా అనూహ్యంగా మన గడ్డపై విజయాలు కోసం శ్రమిస్తోంది. ముఖ్యంగా టెస్టుల్లో మన జట్టు చివరి రెండేళ్లలో సొంతగడ్డపై రెండుసార్లు క్లీన్ స్వీప్ అయ్యారు. అయితే టీమిండియా హెడ్ కోచ్ కు సౌతాఫ్రికా టెస్ట్ కెప్టెన్ టెంబా బవుమా సపోర్ట్ గా నిలిచాడు.  

ఈఎస్పీయన్ క్రిక్ ఇన్ఫో తో మాట్లాడుతూ బవుమా గంభీర్ కు మద్దతుగా మాట్లాడాడు. టీమిండియా టెస్ట్ క్రికెట్ లో పరివర్తన దశలో ఉందని.. గంభీర్ కు కొంచెం సమయం కావాలని బీసీసీఐకి సూచించాడు. "వన్డేల్లో ఇండియాకు దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు. వీరు జట్టును ఎలా ముందుకు తీసుకెళ్తున్నారా మనకి తెలుసు. టెస్ట్ ఫార్మాట్ కు వస్తే ఈ ఇద్దరు టాప్ ప్లేయర్స్ జట్టు ఎంపికకు అందుబాటులో లేరు. ప్రస్తుతం ఇండియా రెడ్ బాల్ క్రికెట్ లో పరివర్తనం చెందుతున్న జట్టు. 

భారత కోచ్ గౌతమ్ గంభీర్ భుజాలపై చాలా ఒత్తిడి ఉంది. అతనికి ఇదొక ఛాలెంజ్ సిరీస్. గంభీర్ రెడ్-బాల్ ఫార్మాట్ లో ఒక కొత్త మార్గాన్ని కనుగొనాల్సి ఉంది. వన్డేల్లో కోహ్లీ, రోహిత్ సహజంగానే తమ ప్రదర్శనలతో, నాయకత్వంతో జట్టును ముందుకు తీసుకెళ్తారు. టెస్ట్ క్రికెట్ లో భారత జట్టుకు త్వరలో కష్టంగా ఉండొచ్చు. గంభీర్ స్థానం మారదని నేను భావిస్తున్నాను". అని బవుమా అన్నాడు. 

గౌతమ్ గంభీర్ జూలై 2024లో టీమిండియా ప్రధాన కోచ్ అయ్యాడు. ఈ 18 నెలల్లో  2025 లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్.. 2025లో ఆసియా కప్‌లో టైటిల్ విజయాలు తప్పితే గంభీర్ ఖాతాలో చెప్పుదగ్గ విశేషాలు ఏమీ లేవు. అయితే పరాజయాలు చాలానే ఉన్నాయి. కోచ్ పదవి చేపట్టిన తర్వాత భారత జట్టు ఈ 18 నెలల్లో 9 చెత్త రికార్డ్స్ నమోదు చేసింది. జట్టు ఓటమికి గంభీర్ ప్రయోగాలే కారణమని కొందరు అంటుంటే.. మరికొందరు ఏమో గంభీర్ వచ్చిన దగ్గర నుంచి డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరం బాగా లేదని చెబుతున్నారు. కారణాలు ఏవైనా గంభీర్ కు బ్యాడ్ లక్ మాత్రం కొనసాగుతోంది.